Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నేలకొండపల్లి
మండలంలోని గువ్వలగూడెం గ్రామ సమీపంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న హైవే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులను సోమవారం గ్రామానికి చెందిన దళితులు అడ్డుకున్నారు. పనులు జరుగుతున్న ప్రదేశంలో గ్రామ దళితులకు చెందిన ముత్యాలమ్మ ఆలయం ఉంది. తాము అనాదిగా ముత్యాలమ్మ తల్లిని పూజించుకుంటూ వస్తున్నామని నేడు తమ ఆలయం హైవే పనుల మూలంగా కోల్పోతున్నామన్నారు. తాము కోరిన కోరికలు తీర్చే తల్లిగా నిత్య పూజలు అందుకుంటున్న ముత్యాలమ్మ తల్లి ఆలయాన్ని వేరొక చోట నిర్మాణం చేసిన తదుపరి మాత్రమే హైవే నిర్మాణ పనులు కొనసాగించాలని పట్టుబట్టారు. లేనియెడల పనులు జరగకుండా అడ్డుకుంటామంటూ ఆందోళనకు దిగారు. ఇదే సందర్భంలో అక్కడి కొంతమంది మహిళలకు అమ్మవారు ఆవహించి పూనకాలుతో ఊగిపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు వంగూరి ఆనందరావు మాదిగ అక్కడకు చేరుకొని దళితులతో మాట్లాడి స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. జరిగిన విషయాన్ని తహసీల్దార్ ధారా ప్రసాదుకు వివరించి ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. స్పందించిన తహసిల్దార్పై అధికారులతో మాట్లాడి ముత్యాలమ్మ గుడి పునర్నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో గువ్వలగూడెం గ్రామ దళిత మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.