Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్దిష్ట కాల పరిమితితో అమలుకు రోడ్ మ్యాప్ ప్రకటన చేయాలి
- భద్రాచలం 3 గ్రామ పంచాయతీల జీవో 45ను ఉపసంహరించుకోవాలి
- పీసా చట్టాన్ని అమలు చేయాలి
- కలెక్టరేట్ ప్రారంభం సందర్భంగా మంత్రి, సీఎంతో స్పష్టత ఇప్పించాలి
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం సమస్యలపై ముఖ్యమంత్రి వాగ్దానాలను అమలు చేసే బాధ్యత మంత్రి పువ్వాడ అజరుకుమార్ తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మిడియం బాబురావు, భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. సీపీఐ(ఎం) భద్రాచలం పట్టణ కమిటీ, శాఖా కార్యదర్శుల సమావేశం మర్లపాటి రేణుక అధ్యక్షతన భద్రాచలం బండారు చందర్ రావు భవన్లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించడానికి రావడాన్ని సీపీఐ(ఎం) స్వాగతిస్తుందని, ఈ సందర్భంగా గతంలో భద్రాచలం ప్రాంతంకి కేసీఆర్ చేసిన వాగ్దానాలను అమలు జరిపే బాధ్యత జిల్లా మంత్రి పువ్వాడ అజరు తీసుకోవాలన్నారు. వరదల సందర్భంగా ముఖ్యమంత్రి భద్రాచలంలో ముంపు నుండి రక్షించడం కోసం నిర్వాసితులను ఆదుకోవడానికి రూ.1000 కోట్లు మంజూరీ చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. గతంలో భద్రాచలం రామాలయం అభివృద్ధి కోసం వంద కోట్లు ప్రకటించారన్నారు. పోలవరం ముంపు వలన జరుగుతున్న నష్టాన్ని ఇటీవల వచ్చిన వరదల సందర్భంగా గుర్తించామని స్వయాన మంత్రి అంగీకరించిన నేపథ్యంలో కరకట్టను పటిష్టం చేసి, ముంపు బారి నుండి ప్రజలను రక్షించడానికి ముఖ్యమంత్రి నుండి నిర్దిష్టమైన ప్రకటన ఇప్పించాలని, అలాగే భద్రాచలంను ఆనుకొని ఉన్న ఐదు గ్రామపంచాయతీల విషయంలో ప్రభుత్వ వైఖరి ప్రకటించాలన్నారు.
తదితర డిమాండ్లను కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం సందర్భంగా ముఖ్యమంత్రితో నిర్దిష్ట ప్రకటన ఇప్పించే బాధ్యత జిల్లా మంత్రిగా ఉన్న పువ్వాడ అజరు తీసుకోవాలని వారు కోరారు. ఇటీవల 45 జీవో ద్వారా భద్రాచలంను మూడు గ్రామ పంచాయతీలుగా విభజన చేస్తూ చేసిన ప్రకటనను ప్రభుత్వం విరమించుకోవాలని, పిసా చట్టాన్ని అమలు చేయాలని, భద్రాచలాన్ని ఒకే పంచాయతీగా ఉంచి తక్షణమే ఎన్నికలు జరపాలని వారు కోరారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి విస్మరిస్తుందని అన్నారు. ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గంలో పోడు భూముల సాగులో ఉన్న పేదలకు అందరికీ పట్టాలు ఇవ్వాలని కోరారు. సర్వేలు, గ్రామసభల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే ఇప్పటివరకు సాగులో ఉన్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. భద్రాచలం నియోజకవర్గం పై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ప్రజలను ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, నాయకులు సున్నం గంగ, బి.వెంకటరెడ్డి, బండారు శరత్ బాబు, సంతోష్, నాగరాజు, జీవన జ్యోతి, చేగొండి శ్రీను, మాధవ రావు, డీవైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, భూపేంద్ర, తదితరులు పాల్గొన్నారు.