Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీఎల్ఏ నుంచి రాని సమాచారం
- నిలిచిన బ్యాంకు ఖాతాల వివరాల నమోదు
- నూతన పట్టాదారుల్లో నైరాశ్యం
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రైతుబంధులో 'కొత్త'మెలికతో నూతన పట్టాదారులు నిరాశకు లోనవుతున్నారు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు ఈసారి రైతుబంధు సాయం దాదాపు రానట్టే కనిపిస్తోంది. వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ శాఖ ముఖ్య కమిషనర్ (సీసీఎల్ఏ) నుంచి వచ్చిన డేటాలో కొత్త రైతుల వివరాలు లేవు. యాసంగిలో పెట్టుబడి సాయం వస్తుందని ఆశపడ్డ కొత్త రైతులు ఇప్పుడు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. రైతుబంధు 2022-23 యాసంగి పంటకాలానికి . ఖమ్మం జిల్లాలో మొత్తం 3,28,491 రైతులకు గాను రూ.363.44 కోట్లు మంజూరు చేశారు. గతేడాది డిసెంబర్ 20 వరకు రెవెన్యూ శాఖ నూతనంగా డిజిటల్ సంతకం చేసిన 8,558 మంది రైతులు కూడా దీనిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. నూతన పట్టాదారులందరూ పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నకలు తో పాటు రైతుబంధు దరఖాస్తును పూర్తి చేసి సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని జనవరి 6 లోపు సంప్రదించాలని జిల్లా వ్యవసాయ అధికారి యం. విజయ నిర్మల సూచించారు. నిర్దేశిత గడువు పూర్తయినా సీసీఎల్ఏ నుంచి వ్యవసాయశాఖకు వివరాలు అందలేదు.
ఖమ్మం జిల్లాలో 8,558 మంది దరఖాస్తు
రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అమల్లోకి తీసుకువచ్చిన తర్వాత వివిధ రకాల సాంకేతిక సమస్యల వల్ల వేలాది మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదు. ఇటీవల కొన్ని సమస్యలను పరిష్కరించడంతో ఖమ్మం జిల్లాలో 8,558 మంది రైతుబంధు సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సరైన ప్రచారం లేకపోవడం, అవగాహన లేమితో ఇంకా కొందరు దరఖాస్తు చేయలేదు. 2022 డిసెంబర్ 20లోపు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన వారు ఈనెల 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రకటించారు. దరఖాస్తు చేసుకున్న రైతులు రైతుబంధు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
నిరాశలో రైతులు
వానాకాలం సీజన్లో రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు వెంటనే వారి ఖాతాల్లో నగదు జమ అయ్యింది. యాసంగిలోనూ అదే విధంగా వస్తుందని కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఆశపడ్డారు. కానీ, సీసీఎల్ఏ నుంచి సమాచారం రా కపోవడంతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. బ్యాంకు పాస్ పుస్తకం నంబర్‌ను ఎంట్రీ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వ్రెబ్సైట్ ఓపెన్ కావడం లేదని అధికారులు చెబుతున్నారు.
గడువు ముగిసినా వివరాలు పంపని సీసీఎల్ఏ
గడువు ముగిసినా నూతనంగా పట్టదారు పాస్ పుస్తకాలు తీసుకున్న రైతుల వివరాలను సీసీఎల్ఏ వ్యవసాయశాఖకు పంపించలేదు. వ్యవసాయ శాఖ కమిషనర్ వెబ్సైట్లో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలు లేవు. గతంలో మాదిరిగానే రకరకాల సాంకేతిక సమస్యలు చూపుతోంది. నూతన పాస్ బుక్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, విస్తీర్ణం వివరాలను సీసీఎల్ఏ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఈ వివరాల ఆధారంగా ఏఈఓలు రైతుల బ్యాంకు పాస్‌పుస్తకం వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత రైతుబంధు సాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. కానీ వెబ్సైట్లో వారి వివరాలు చూపడం లేదు.
డేటా వస్తే జమ చేస్తామంటున్న వ్యవసాయ అధికారులు
కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారి డేటా సీసీఎల్ఏ నుంచి రాలేదని, డేటాలో పట్టాదారు పాస్ బుక్ నంబర్, రైతు పేరు ఉంటుందని, ఈ వివరాలు సీసీఎల్ఏ నుంచి వస్తేనే నిర్ణీత ఫార్మాట్లో రైతుల బ్యాంకు అకౌంట్ నంబర్ అప్లోడ్ చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమచేయడానికి వీలవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. గత సీజన్లలో కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారికి వెంటనే రైతుబంధు సహాయం అందిందని, ఈసారి డేటా రాగానే వారి ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు. కానీ ఇప్పటికే గడువు ముగియడంతో వారూ ఏమి చెప్పలేని పరిస్థితులో ఉన్నారు.
రైతుబంధు దరఖాస్తు చేశా...కానీ నిరాశ తప్పట్లే..!
- దొబ్బల శతి, రాఘవాపురం, చింతకాని మండలం
నాగులవంచ రెవెన్యూలో వారసత్వంగా నాకు సంక్రమించిన రెండు ఎకరాల భూమి నవంబర్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. రైతుబంధు కోసం దరఖాస్తు చేశాను ఇంతవరకు రైతుబంధు జమ కాలేదు. ఇప్పటికే గడువు ముగిసిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వస్తే మా పేరెంట్స్ కు పంట పెట్టుబడికి ఉపయోగి పడుతుందని ఆశించాను. కానీ అది నెరవేరే సూచనలు కనిపించడం లేదు.