Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ ఛైర్మెన్ మహేశ్ ఆధ్వర్యంలో వెంకంపేట్ మోడ్రన్ దోబీఘాట్‌ను సందర్శించిన 20 మంది రజకుల బృందం
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్ నేతృత్వంలో స్థానిక రజక సంఘ నాయకులు 20 మంది బృందం సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని అధునాతన యాంత్రీకృత దోబీఘాట్ (మోడ్రన్ మెకనైజ్డ్ దోబీఘాట్)ను మంగళవారం సందర్శించారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో ప్రభుత్వం రూ. 1.05 కోట్ల ఖర్చుతో దోబీఘాట్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. సత్తుపల్లికి కూడా ప్రభుత్వం మోడ్రన్ దోబీఘాట్ నిర్మాణం కోసం రూ.70లక్షలు మంజూరు చేసింది.
సిరిసిల్ల దోబీఘాట్ తరహాలోనే సత్తుపల్లిలో కూడా దోబీఘాట్ ఏర్పాటు చేసేందుకు మున్సిపాలిటీ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపధ్యంలో ఇక్కడి రజక సంఘ నాయకులను సిరిసిల్ల దోబీఘాట్ మోడల్‌ను చూపించేందుకు ఎమ్మెల్యే సండ్ర సూచన మేరకు ఛైర్మెన్ మహేశ్ అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడి దోబీఘాట్లో 30 కిలోల సామర్థ్యం ఉన్న వాషింగ్ మిషన్లు, హైడ్రో ఎగ్జాస్టర్, డ్రయ్యర్లు, బెడ్‌షీట్ రోలింగ్ యూనిట్, వాక్యూమ్, స్టీం ఇస్త్రీ మిషనరీ ద్వారా బట్టల ఉతికి ఆరబెట్టడం, ఇస్త్రీ తదితర విధానాలను రజకులకు క్షేత్ర సందర్శన ద్వారా వివరించారు. ఎమ్మెల్యే మహేశ్ వెంట ప్రజా ఆరోగ్యశాఖ ఈఈ రంజిత్, రజకసంఘం అధ్యక్ష, కార్యదర్శులు బెల్లంకొండ రాము, పర్సా సోమయ్య, నాయకులు కంభంపాటి మల్లికార్జునరావు, నిమ్మ టూరి రామకృష్ణ, మరికంటి శ్రీను, సత్యనారాయణ, టోపీ శ్రీను, పంతంగి నరసింహారావు, రాయల కోటేశ్వరరావు ఉన్నారు.