Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులతో ఐదు లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. సింగరేణి సీఎండితో మాట్లాడి ఇక్కడి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ముర్రేడు వాగుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 481 పంచాయతీలకు గ్రామానికి రూ. 10 లక్షల చొప్పున సీఎం ప్రత్యేక నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు గాను కొత్తగూడెం, పాల్వంచలకు రూ. 40 కోట్ల చొప్పున, మణుగూరు, ఇల్లందు మున్సిపాలిటీలకు 25 కోట్ల చొప్పున అభివద్ధి నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇక్కడ మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీకి పూర్తిస్థాయి వసతులు కల్పించనున్నట్లు సీఎం చెప్పారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, టిఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ కనకయ్య, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్, కలెక్టర్ అనుదీప్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.