Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ శాంతి కుమారి
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, మేము పనిచేసిన కాలంలో ఇరుకు గదులు, ఎలాంటి సౌకర్యాలు లేని కాలంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించామని ప్రస్తుతం కలెక్టరేట్ భవన్లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నందున ప్రజలకు పారదర్శకమైన పాలన అందించాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ శాంతి కుమారి కోరారు. కలెక్టరేట్ భవన సముదాయ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ భవన సముదాయ ప్రారంభోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చీఫ్ సెక్రటరీ మాట్లాడారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కొత్త జిల్లాలలో నూతన కలెక్టెట్ భవనాల సముదాయం ప్రారంభించడం జరుగుతుందని, ఇది 16వ సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం అని తెలిపారు. ప్రజలకు పరిపాలన సాలభ్యం కోసమే నూతన కలెక్టరేట్ భవన సమయాన్ని ఇంటిగ్రేటెడ్గా రూపొందించడం జరిగిందన్నారు. కలెక్టరేట్ భవనాలను చూస్తుంటే ఇప్పటి కలెక్టర్ల మీద ఈర్ష కలుగుతుందన్నారు. మాకు సరైన సౌకర్యాలు లేని రోజుల్లోనే ప్రజలకు సేవలందించామని గుర్తుచేశారు. దేశంలో రంగాలలో ముందుకు పోతున్న తెలంగాణ యంగ్ రాష్ట్రంగా అభివర్ణించారు. అన్ని జిల్లాలో కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు, రాష్ట్రంలో 24 గంటల విద్యుత్తు అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమం ద్వారా 8 శాతం అడవుల విస్తీర్ణం పెరిగిన సంగతి గుర్తు చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తన నియోజకవర్గంలో ప్రయాగాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. నిరాధారణకు గురవుతున్న బడుగు, బలహీన వర్గాలు, చిన్న పిల్లలు, వృద్ధులకు ఈ కంటి వెలుగు కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా 2018లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.