Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యలమంచి వంశీకృష్ణ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహకుల నిర్లక్షం, మిల్లర్లు తరుగు పేరుతో నష్టపోయిన గిరిజన రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యలమంచి వంశీకృష్ణ, జిల్లా నాయకులు బొల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మారాయిగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గత సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన ఏడుగురు గిరిజన రైతులకు చెందిన ధాన్యాన్ని ఎఫ్సీఐ కేంద్రం వారు కొనుగోలు చేసి 859 బస్తాల లోడుతో వెంకటసాయి రైస్ మిల్కు ధాన్యం తరలించడం జరిగిందన్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత ధాన్యం బాగా లేదని వెనక్కి తీసుకు వెళ్లాలని లేదా 61 బస్తాల ధాన్యాన్ని తరుగు కింద తీస్తామని గిరిజన రైతులను బెదిరించడంతో పాటు వారిని ఒత్తిడి చేసి వారి వద్ద నుండి సంతకాలు సేకరించి 61 బస్తాలు తరుగు తీసి 795స్తాలకు కొత్త ట్రక్ షీటు అందజేశారని వారు తెలిపారు. ఏదో ఒక రైతుకు చెందిన ధాన్యం బాగా లేక పోతే వాటిని పరిశీలించాలి తప్ప ఏడుగురు రైతులకు చెందిన 61 బస్తాలు తరుగు తీయడం వలన గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోయరన్నారు. అమాయకపు గిరిజన రైతులను బెదిరించి తరుగు తీశారని దీనిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఒక్క ట్రక్కులోనే 25 క్వింటాళ ధాన్యాన్ని తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు. రైతులను తరుగు పేరుతో మోసం చేస్తే తెలంగాణ రైతు సంఘంగా తాము ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మారాయిగూడెం సర్పంచ్ తొడం తిరుపతిరావు, అర్జున్, అపకా సంతోష్ కారం శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.