Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
సనాతన వైదిక బ్రాహ్మణ వంశంలో పుట్టి వంశ పారంపర్యంగా సంక్రమించిన పురోహిత వృత్తిని ఎంచుకొని నిరుపేదల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించి రైతులు, కూలీలు పక్షాన అనేక మిలిటెంటు పోరాటాలు నిర్వహించిన వ్యక్తి మరపురాని మార్కిస్టు చామర్తి పుండరీ కాక్ష శాస్త్రి అని సీపీఐ(ఎం) మండల కమిటీ పేర్కొంది. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం సుందరయ్య భవంనంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ(ఎం) కార్యవర్గ సభ్యులు దొడ్డా లక్ష్మినారాయణ అధ్యక్షతన అమరజీవి కామ్రెడ్ చామిర్తి పుండరీ కాక్ష శాస్త్రి 27వ వర్థంతి నిర్వహించారు. తొలుత చామర్తి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన వర్థంతి సభలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా లకిëనారాయణ, మోరంపూడి శ్రీనివాసరావులు మాట్లాడారు. శాస్త్రి తన తుది శ్వాస వరకు మార్క్సిజమే అజేయమని నమ్మి ఆ సిద్దాంతాలకు కట్టుబడి దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడి నిరంతరం వారి సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. పట్టణంలో ప్రస్తుతం అర్బన్ కాలనీగా పిలవబడుతున్న ఒకప్పటి సుందరయ్య నగర్ నిర్మాణం కోసం, పేదల ఇండ్ల కోసం శాస్త్రి ప్రధాన పాత్ర పోషించి అర్బన్ కాలనీని సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. పార్టీ మండల మొట్టమొదటి కార్యదర్శి అయిన పుండరీ కాక్ష శాస్త్రి కులమతాలకు అతీతంగా అప్పట్లోనే ఎంతో సాహసం చేసి దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించడంలో విజయాన్ని సాధించారని పేర్కొన్నారు. మండలంలో జమేదారుబంజర్, లింగాలపల్లి, పార్కలగండి, పెద్దగొల్లగూడెం, చిన్నగొల్లగూడెం మల్లారం, నల్లకుంట గ్రామాలలో గిరిజనుల దళితుల పక్షాన నిలబడి వారు పోడుభూములు కొట్టుకొని సాగు చేసుకునేవిధంగా గిరిజనులను దళితులను ప్రోత్స హించి శాస్త్రి అండగా నిలబడ్డారని వివరించారు. శాస్త్రి ఈ ప్రాంతంలో అసైన్మెంట్ భూములపై అనేక పోరాటాలు నిర్వహించి 1977, 1978 మధ్య కాలంలో పేదలకు అసైన్మెంట్ భూములు పంపిణీ చేయడానికి ప్రభుత్వం విధించిన నిర్భంద కాండను సైతం లెక్కచేయ కుండా పేదలకు అసైన్మెంట్ పట్టాలు పంపిణీ చేయడలంలో ఆయన కృషి అమోఘమని శ్లాఘించారు.
నిరుపేద కుటుంబాలలో జరిగే వివాహాలకు, అశుభ కార్యాలకు సైతం శాస్త్రి ఉచితంగా పురోహితం నిర్వహించి మండల వ్యా ప్తంగా ఉన్న పేద ప్రజల మన్ననలు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో జీసీసీ హామాలి వర్కర్స్ యూనియన్ నాయకులు బోగిం సత్యం, బోగిం నరసింహారావు, కొప్పుల శ్రీనివాసరావు, మణికంఠ , మునగాల మారేష్, యడవల్లి శ్రీనివాసరావు, కోట వెంకటేశ్వరరావు, చెన్నారావు, చింద్రం వెంకటేశ్వరరావు, సుధాపల్లి నాగరాజు, సుబ్బారావు, రాజు, రొయ్యల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.