Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్ మోహరించి ఆదివాసీలపై దాడులకు దిగుతున్నారు
- జిల్లా కార్యదర్శి ఆజాద్
నవతెలంగాణ-చర్ల
గగనతల దాడులు హేయమైన చర్య అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా-అల్లూరి సీతారామరాజు జిల్లాల కార్యదర్శి ఆజాద్ విమర్శించారు. ఆ మేరకు గురువారం చర్ల పాత్రికేయులకు ఒక లేఖ పంపారు. ఆలేఖలో ముఖ్యంగా దేశ సంపద దోచుకుపోయేందుకు దారులు సుగమం చేస్తున్న పాలకులు బుధవారం సరిహద్దుల్లో జరిగిన సర్జికల్ స్ట్రైక్‌లో మావోయిస్టు నేత బెటాలియన్ కమాండర్ కామ్రేడ్ హిడ్మ మరణించినట్లు ఇరు రాష్ట్రాల పోలీసులు దేశం అంతా ప్రచారం చేశారని, దాడులు చేసింది నిజమే కానీ వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరలేదని, దాడికి మా ప్రజా గెరిల్లా సైన్యం (పీఎల్జీఏ) గట్టి సమాధానం ఇచ్చిందని, నిజంగా దేశ ప్రజలపై ఈ దేశంలో ఉన్న సైన్యం దాడి చేయడం తిరిగి ఆ దాడులను సమర్థించుకోవడం, సిగ్గులేకుండా దాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందని ఆ లేఖలో ఉంది. దేశ భద్రత కోసం దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం ఛత్తీస్‌ఘడ్ అడవుల్లో ప్రతి నాలుగు ఊళ్ళకు ఒక క్యాంపు పెట్టి ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆ లేఖలో ఆజాద్ పేర్కొన్నారు. నిత్యం ఇనుప బూట్ల పదఘట్టనలో ఆదివాసీలు నలిగిపోతున్నారని ఈ దేశంలో అత్యంత విలువైన సంపద ప్రస్తుతం ఛత్తీస్‌ఘఢ్ దండకారణ్యంలో ఉందని, అనేక రకాల ఖనిజాలు, అటవీ సంపద కొల్లగొట్టేందుకు భహుల జాతీ కంపెనీలు పన్నాగం పన్నాయని, మిగతా ప్రాంతాల్లో లాగా ఇక్కడ సంపద దోచుకుపోయేందుకు వీలు పడటంలేదని, ఆదివాసీలను నిత్యం చైతన్యం చేస్తూ వారి సంపద వారికే దక్కాలని మావోయిస్టు పార్టీ కోరుతుందని, ఇది పాలకులకు మింగుడు పడటంలేదని, అందుకు మావోయిస్టు పార్టీని ధ్వంసం చేసేందుకు శత విధాల కుట్రలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులు పూనుకుంటున్నారని, బీజేపీ ప్రభుత్వం మొత్తం ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాన్ని పోలీసు క్యాంపుగా మార్చిందని తెలిపారు. ఆకు పచ్చ అడవిలో నెత్తుటేరులు పారించేందుకు నిత్యం దాడులు చేస్తుందని, ఆఖరికి వైమానిక దాడులు చేస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన లేఖలో పేర్కొన్నారు. పోలీస్ యంత్రాంగం ఇప్పటికే అనేక మార్లు వైమానిక దాడులకు పూనుకుందని, అనేక సార్లు గ్రామాలపై మోటార్ సెల్స్ వేసిందని, వీటన్నిటిని ప్రజలు గమనించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీని ప్రజల నుంచి వేరు చేసేందుకు సామ, ధాన, బేధ, దండోపాయాలను ఎంచుకున్నాయని, ఇలాంటి దాడులను ఖండించాలని పిలుపునిస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోడీ, అమిత్ షాలు ఇద్దరూ సామ్రాజ్యవాద ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, దేశంలో రాజ్యంగ హక్కులను హరించివేస్తున్నారని, ప్రశ్నించే హక్కు, జీవించే హక్కులను దేశ సంపద కొందరి చేతుల్లో ఉండేందుకు వీలు కలిగేలా చట్టాలను బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఆయన ఆ లేఖలో విమర్శించారు. కాబట్టి సమాధాన్ ప్రహార్ దాడులను ఖండించండని, దేశ ప్రజలపై వైమానిక దాడులు చేయండం హేయమైన చర్యని, ప్రజలారా మేల్కొనండి, దేశ సంపద కాపాడుకునేందుకు పోరాటాలు చేయండని, గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా పోరాడండని, దండకారణ్యంలో ఏర్పటు చేసిన సైన్యాన్ని తక్షణం ఉపసంహరించాలని, ప్రజా గెరిల్లా సైన్యం వర్థిల్లాలని ఆ లేఖలో ఆజాద్ వివరించారు.