Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిక్షాటన చేస్తున్న ఔట్సోర్సింగ్, డైలీ వేజ్ కార్మికులు
- 22 నెలలుగా వెట్టి చాకిరి
- పట్టించుకోని గిరిజన సంక్షేమ శాఖ
నవతెలంగాణ-ఇల్లందు
రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులందనీ పర్మనెంట్ చేస్తామని సీఎం కేసీఆర్ అనేక ప్రసంగాల్లో హామీఇచ్చారు. హామీ నెరవేరకపోగా గత 8 ఏండ్లుగా ఔట్సోర్సింగ్ కార్మికులను నియమిస్తూవచ్చారు. వీరికి గత 22 నెలలుగా వేతనాలు మంజూరు చేయడం లేదు. డైలీ వేజ్ కార్మికులుకు 8నెలల వేతన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, పెంచిన పీఆర్సీ వేతనాలు అమలు చేయడం లేదు. దీంతో ఔట్సోర్సింగ్ కార్మికులు అప్పుల పాలై కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గత ఆరు నెలలుగా దశలవారి ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఐటీడీఏ ఆధ్వర్యంలో నడిచే సెల్ఫ్ మేనేజ్మెంట్ 2006లో ఏర్పాటు చేశారు. ట్రైబల్ వెల్ఫేర్ బాల బాలికల గురుకులాల్లో 2015 ఔట్సోర్సింగ్ డైలీ వేజ్ వర్కర్స్‌ను నియమించారు. ఇల్లందు, గుండాల, అల్లపల్లి, టేకులపల్లి మండలాల్లో 28 మంది జిల్లాలో 94 మంది ఔట్సోర్సింగ్ కార్మికులకు విద్యార్థినీ, విద్యార్థులకు వంటలు వండి పెడుతున్నారు. హాస్టల్లో ఉండే ఇతర పనులు సైతం చేస్తున్నారు. 2015లో రూ.300 వేతనం చెప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. అనంతరం రూ.3 వేలు, 5వేలు, తరువాత 12,500కు వేతనం పెంచింది. రూ.2 వేలు పీఎఫ్ కటింగ్ పోను రూ.10,500 ప్రతినెల వేతనం మంజూరు చేసేది. గత 22 నెలలుగా ప్రభుత్వం వేతనం మంజూరు చేయడం లేదు. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ పీఎంహెచ్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ కార్మికులుకు 8నెలల వేతన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, పెంచిన పీఆర్సీ వేతనాలు అమలు చేయడం లేదు. పీఎఫ్‌లో ఉన్న అవకతవకల్ని సరి చేయడం లేదు. అర్హత కలిగిన 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం లేదని సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు ఈసం పద్మ, కుంజ జయ, యదలపల్లి అంజమ్మ, వరుస సుధా, దీప, సుజాత, సరోజ, విజయభారతి, భద్రమ్మ భారతి, శైలజ, వెంకటమ్మ, రమ, సుబ్రహ్మణ్యం, అనిత, నాగయ్య సుబ్రమణ్యం, సమ్మక్క, సుగుణ, సుశీల, లక్ష్మీ, రాజమ్మ, రమ, రజిత, రమని, జానకి తదితర కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో 7 నెలలుగా దశలవారి ఆందోళనలు చేస్తున్నా పట్టింపు లేని ప్రభుత్వం
గత ఏడు మాసాలుగా అనేక పర్యాయాలు ఐటీడీఏ పీవో, కమిషనర్ గిరిజన సంక్షేమ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా గాని సమస్య పరిష్కారం కాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రంలోని గిరిజన నియోజక వర్గ కేంద్రాలలో ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల వద్ద ఖాళీ ప్లేట్లతో నిరసన చేపట్టారు. డీటీడబ్ల్యు కార్యాలయాల ముట్టడి, విధులకు ఆటంకాలు అర్ధనారి నా ప్రదర్శన మోకాళ్లపై నిరసన అంబేద్కర్ విగ్రహాలకు వినతులు, నిరవధిక సమ్మెలు ఇలా చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కనికరించడం లేదు.
అప్పుల పాలై అర్ధాకలితో అలమటిస్తున్నాం : ఈసం పద్మ ఔట్సోర్సింగ్ కార్మికురాలు
మాది కాకతీయ నగర్ 2006లో ట్రావెల్ వెల్ఫేర్‌లో కూలిగా పని చేశాను. అనంతరం ఔట్సోర్సింగ్ కార్మికురాలుగా పనిచేస్తు న్నాను. గత 22 నెలలుగా వేతనం ఇవ్వడం లేదు. అధికారులను అడిగితే వస్తుంది వస్తుంది అంటున్నారు. ఇల్లు గడవడం కష్టంగా ఉంది. అర్ధాకలితో అలమటిస్తున్నాం. ప్రభుత్వం వేతనాలు విడుదల చేయాలి.
ప్రభుత్వం కనికరించాలి వేతనాలు విడుదల చేయాలి : ఈసం వెంకటమ్మ ,కొల్లాపురం
2021 నుండి 300 వేతనంతో పనిచేస్తున్నాను. నిరవధిక చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కనికరించడం లేదు. పని చేయించుకుంటూ నెల నెల వేతనాలు ఇవ్వకపోవడం దారుణం. తక్షణం వేతనాలు విడుదల చేయాలి.
ఐదు నెలల వేతనాల బడ్జెట్ విడుదల...త్వరలోనే కార్మికుల అకౌంట్లోకి
డీటీడబ్ల్యూఓ రూపా దేవి
ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు 22 నెలల అందరి వేతనాలపై డీటీడబ్ల్యూఓ రూపా దేవిని వివరణ కోరగా స్పందించారు. వారి బాధలు తెలుసన్నారు. మేము హాజరు వేసి పంపిస్తాం. ప్రభుత్వమే వేతనాలు విడుదల చేయాలన్నారు. నాలుగు రోజుల క్రితం ఐదు నెలల వేతనాల బడ్జెట్ ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. త్వరలోనే వేతనాలు వస్తాయన్నారు.
ఔట్సోర్సింగ్ కార్మికులను పట్టించుకోకపోవడం దారుణం
ఎమ్మెల్యేలు, ఉద్యోగులకు లక్షల్లో వేతనాలు ఇస్తున్న ప్రభుత్వం ఔట్సోర్సింగ్ కార్మికులను పట్టించు కోకపోవడం దారుణం. రెండేళ్లుగా రావాల్సి నటువంటి వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ ప్రభుత్వం, మంత్రుల దృష్టికి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ డైలీ వేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయు) ఆధ్వర్యంలో తీసుకెళ్లిన గానీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు. పండగ పూట కూడా కుటుంబాలు యావత్తు పస్తులు ఉండాల్సి వస్తుంది. ఇచ్చే అరకొర వేతనాలతో కుటుంబాలు గడవక అనేక అవస్థలు పడుతున్నారు. వేతన బకాయలు తక్షణ విడుదల చేసి ఆదుకోవాలి.
- సీఐటీయూ డివిజన్ కన్వీనర్ అబ్దుల్ నబీ