Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్ చే లాంఛనంగా ప్రారంభం
- ప్రజలు షెడ్యూల్ ప్రకారం వచ్చేలా ప్రణాళిక
- ప్రతి ఇంటికి కంటి వెలుగు ఆహ్వాన పత్రిక
వాట్సాప్ గ్రూపుల ద్వారా క్యాంపుల పర్యవేక్షణ
- క్యాంపులకు వస్తే ఆధార్ కార్డు తప్పనిసరి
- ఖమ్మం నుంచి కలెక్టర్ లతో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
జనవరి 19న ఉదయం 9 గంటల నుంచి జిల్లాలలో కంటి వెలుగు శిబిరాలు ప్రారంభించాలని రాష్ట్ర ఆర్థిక వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కలెక్టర్ లను ఆదేశించారు. ఖమ్మం కలెక్టర్ కార్యాలయం నుంచి, రాష్ట్ర సీఎస్ శాంతికుమారి , డీజిపి అంజనీ కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి, కమిషనర్ శ్వేతలు హైదరాబాద్ బీఆర్కె భవన్ నుంచి కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ పట్ల తీసుకోవాల్సిన చర్యల పై అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు తగిన భద్రత కల్పించాలని తెలిపారు. జనవరి 18న ఖమ్మం లో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని, జిల్లాలలో జనవరి 19న ఉదయం 9 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, జడ్పీ చైర్మన్లు జెడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచులు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలని మంత్రి సూచించారు. జిల్లాలలో కలెక్టర్, డిఎంహెచ్ఓ లు వాట్సాప్ ద్వారా ప్రతి బందం సకాలంలో క్యాంపులు ప్రారంభించేలా పర్యవేక్షణ చేయాలన్నారు. జిల్లాలో ఉన్న వైద్య బందాలు సమీప పట్టణాలు, మండల హెడ్ క్వార్టర్ లో నైట్ హాల్ట్ చేసేలా కలెక్టర్ లు చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం 8-45 వరకు తప్పనిసరిగా బృందాల సభ్యులు క్యాంపు లోకేషన్ కు చేరుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. కంటి వెలుగు క్యాంపులు విజయవంతం అయ్యేందుకు పంచాయతీ కార్యదర్శులు, అంగన్ వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆర్పిలు, విఆర్ఏలను భాగస్వామ్యం చేయాలని, క్యాంపు నిర్వహణ ముందస్తు సమాచారం ప్రజలకు తెలియజేసి ప్రతి ఇంటికి ఆహ్వాన పత్రిక అందించాలన్నారు. ప్రజలు ఉదయం, మధ్యాహ్న సమయాల్లో వచ్చే విధంగా షెడ్యూల్ చేయాలని మంత్రి సూచించారు. ప్రతి వైద్య బందానికి క్యాంపు నిర్వహణ కోసం అవసరమైన సామగ్రి, మందులు, కళ్ళద్దాలు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కంటి వెలుగు శిబిరాలకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా వారి ఆధార్ కార్డు తీసుకుని వచ్చే విధంగా అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో క్యాంపుల నిర్వహణ కంటే ముందుగా సంబంధిత ఆశా, ఎఎన్ఎం లు పర్యటించి షెడ్యూల్ వివరాలు తెలియజేస్తూ కంటి వెలుగు పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో ఉన్న ఎంపిఒ, ఎంపిడిఓ లు, తహసిల్దార్ లు, మండల ప్రత్యేక అధికారి ప్రతి రోజు పరిధిలో గల క్యాంపులను తనిఖీ చేయాలన్నారు. జిల్లా స్థాయిలో డిఎంహెచ్ఓ, ఇతర ప్రోగ్రాం అధికారులు విస్తృతంగా పర్యటిస్తూ క్యాంపుల నిర్వహణను తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రణాళిక బద్ధంగా ప్రజలు క్యాంపులో పాల్గొని కంటి పరీక్షలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో కంటే బృందాల సంఖ్యను రెట్టింపు చేశామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఖమ్మం మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బి. మాలతి, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, జెడ్పి సిఇఓ వి.వి. అప్పారావు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.