Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు కలెక్టర్ అనుదీప్ ఆదేశం
నవతెలంగాణ-పాల్వంచ
ప్రజావాణిలో వచ్చిన వినతులు పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు భవనంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల వినతులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మండలాల నుండి వచ్చిన దరఖాస్తులపై తహసిల్దారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా వివరాలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చూపాలని ఆదేశించారు. ప్రజవాణిలో వచ్చిన ఫిర్యాదుల్లో చుంచుపల్లి మండలం, బాబుక్యాంపునకు చెందిన భూక్యా వీరన్న తాను గత ఏడు సంవత్సరాలుగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు జిరాక్సు, స్టేషనరీ, ఇంటర్నెట్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నానని దాని ద్వారానే ఆధారం చేసుకుని జీవిస్తున్నాని, డీఈఓ కార్యాలయం నూతన కలెక్టరేట్ లో ఏర్పాటు చేయడం వల్ల ఉపాధికోల్పోయానని, తనకు కలెక్టరేట్ ప్రాంగణంలో కానీ బయట కానీ జిరాక్స్, ఇంటర్నెట్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం డీఆర్‌కు ఎండార్స్ చేశారు. పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకు చెందిన గోదావరి నది ముంపు బాధితులు రెండు నియోజకవర్గాల్లో దాదాపు 25 వేల మంది వరద ముంపుకు గురయ్యామని, ముంపు బాధితులకు సురక్షిత ప్రాంతాల్లో శాశ్వత గృహాలను నిర్మిస్తామని ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలైన ఆదివాసిలకు, దళితులకు, ఇతర వర్గాల నిరుపేద సామాజిక వర్గ ప్రజలకు ఇళ్లు నిర్మించాలని ధరఖాస్తు చేశారు. పాల్వంచ మండలం, మంచికంటి నగర్‌కు చెందిన గురుగుంట్ల బూబమ్మ వితంతువైన తాను కొన్ని సంవత్సరాల నుండి నవభారత్ వద్ద రోడ్డు పక్కన చిన్న బడ్డీకొట్టు పెట్టుకుని టీ అమ్ముకుంటు జీవనం సాగిస్తున్నాన్నానని, ఇపుడు బడ్డీ కొట్టు తీయాలని చెప్తున్నారని, జీవనాధారం కోల్పోతున్నానని, తనకు న్యాయం చేయాలని చేసిన ఫిర్యాదును పరిశీలించిన ఆయన తగు చర్యలు నిమిత్తం కలెక్టరేట్ ఓఎస్టీకి ఎండార్స్ చేశారు. నుజాతనగర్ మండలం, సీతంపేటబంజర గ్రామానికి చెందిన గుగులోత్ మంగ్యా సర్వే నెం.1073/ రు/5లో 1.30 ఎకరం భూమి కలదని, అట్టి భూమికి 2021 సంవత్సరం నుండి రైతుబంధు నిధులు రావడం లేదని, తనకు రైతుబంధు మంజూరు చేపించాలని చేసిన ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం ధరణి కో ఆర్డినేటర్‌కు ఎండార్స్ చేశారు. పాల్వంచ మండలం, గట్టాయిగూడెం గ్రామానికి చెందిన బి.పూర్ణ చంద్రరావు పాల్వంచ మండల పరిధిలోని పెద్దమ్మతల్లి (శ్రీ కనకదుర్గ దేవాలయంలో) గతంలో జరిగిన, ప్రస్తుతం జరగున్న అభివృద్ధి పనుల్లో నిబంధనలు ఉల్లంఘించారని దేవాలయ ప్రతిష్టకు బంగం కలుగకుండా బాద్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చేసిన ఫిర్యాదును పరిశీలించిన ఆయన తగు చర్యలు నిమిత్తం దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.