Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తండోపతండాలుగా కదలాలి
- బీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత,ఎంపీ నామ పిలుపు
- తెలంగాణా అంటేనే అభివృద్ధి, సంక్షేమం
నవతెలంగాణ-పాల్వంచ
18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ ఖమ్మం సభ అపూర్వ ఘట్టం కావాలని తండోపతండాలుగా కదలి రావాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు, రైతులకు, విద్యార్థి, యువజన, మహిళా లోకానికి పిలుపునిచ్చారు. సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్వగృహంలో వనమా అధ్యక్షతన జరిగిన సభ సన్నాహాక సమావేశంలో నామ మాట్లాడారు. చరిత్రాత్మకమైన ఖమ్మం సభ దేశ రాజకీయాలకు మార్గదర్శకం చేస్తుందని అన్నారు. నేడు దేశం యావత్తు చూపు ఖమ్మం సభ వైపే ఉందని తెలిపారు. చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా ప్రజలు సభకు పెద్ద ఎత్తున హాజరై తమ సత్తా చాటాలన్నారు. తెలంగాణా అంటే అభివృద్ధి, సంక్షేమం అన్నారు. నేడు దేశం యావత్ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మోడల్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుందన్నారు. తెలంగాణా అభివృద్ధిని చూసి కుట్రలతో కేంద్రం తెలంగాణను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. నిధులు, ప్రాజెక్టులు ఇవ్వకుండా, విభజన హామీలు ఏ ఒక్కటి ఇవ్వకుండా వివక్షత చూపిస్తుందన్నారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక బిల్లును పార్లమెంటులో తీవ్రంగా అడ్డుకున్నట్లు నామ చెప్పారు. అయితే మెజార్టీ ఉందని, పార్లమెంట్లో ఆమోదించిందని, కానీ లక్షలాది మంది రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయడంతో బిల్లును కేంద్రం వాపసు తీసుకుందని నామ గుర్తు చేశారు. ప్రధాని రైతులకు క్షమాపణ చెప్పారని అన్నారు. సీఎం కేసీఆర్ తన గొంతిలో ప్రాణం ఉన్నంత వరకు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారని అన్నారు. ఇది రైతు ప్రభుత్వం అని నామ అన్నారు. ఈ సందర్భంగా నామను గజ మాలతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మాజీ మంత్రి బసవరాజు సారయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కంచర్ల చంద్రశేఖర్ రావు, కావు సీతాలక్ష్మి, కిలారు నాగేశ్వరరావు, భూక్యా రాంబాబు, బరపటి వాసుదేవరావు, బిందు చౌహాన్, బత్తుల వీరయ్య, వెంకట్రావ్, మండే హన్మంతరావు, కొత్వాల శ్రీనివాసరావు, డిందిగాల రాజేందర్, రాజుగౌడ్, సరస్వతి, శాంతి, జగన్, రజాక్, కాసుల వెంకట్, మహిపతి రామలింగం, విశ్వనాధం, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.