Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెడికల్ మాఫియా అడ్డాగా మారిన భద్రాచలం ఆస్పత్రులు
- పద్ధతి మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు
- మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఆజాద్ హెచ్చరిక
నవతెలంగాణ-చర్ల
మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం ఇప్పుడు మెడికల్ మాఫియాకు కాసులు కురిపిస్తోందని భద్రాద్రి కొత్తగూడెం - అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే-ఏఎస్ఆర్) కార్యదర్శి ఆజాద్ విమర్శించారు. ఆ మేరకు సోమవారం చర్ల పాత్రికేయులకు ఓ లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో ముఖ్యంగా భద్రాచలం ప్రాంతం పూర్తి ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని సంపాదనే ధ్యేయంగా ఆసుపత్రులు పనిచేస్తున్నాయని, ప్రజల ఆరోగ్యాన్ని బూచిగా చూపి వారిని భయబ్రాంతులకు గురిచేసి రోగుల రక్తం పిండుకుంటున్నారని ఆ లేఖలో ఆజాద్ ధ్వజమెత్తారు. ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్ర ప్రాంత గిరిజనులు, గిరిజనేతరులతో పాటు స్థానిక తెలంగాణ ప్రాంత ప్రజలను వైద్యం పరుతో రోజుల తరబడి ఆసుపత్రుల్లో ఉంచి అవసరం లేకున్నా రకరకాల పరీక్షలు చేస్తూ ల్యాబులు, ఆస్పత్రులు, వైద్యులు ప్రజలను డబ్బుల కోసం హింసిస్తున్నారన్నారు. ప్రజల నమ్మకానికి తూట్లు పొడుస్తూ కొందరు వైద్యులు రాక్షసుల్లా తయారయ్యారని, పెద్దోళ్లు.. పేదోళ్ళనే తేడాలు లేకుండా రోగుల రక్తం జలగల్లా పీల్చుతున్నారన్నారు. ఆరోగ్య సమస్యలను అలుసుగా చేసుకుని, మనిషిలో రకరకాల పరీక్షల పేర్లతో భయాన్ని సృష్టిస్తూ ఆసుపత్రి వర్గాలు గందరగోళంను సృష్టిస్తూ జేబులు నింపుకుంటున్నాయన్నారు. ప్రైవేటు ఆసుపత్రి మొదలుకొని ప్రభుత్వ ఆసుపత్రి వరకు కాసుల కక్కుర్తి మరిగిన వైద్యులు జనాలను పీడించుకుతింటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో పని చేసే వైద్యులు సైతం తమ సొంత క్లీనిక్లకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ప్రభుత్వ పనివేళలను విస్మరిస్తున్నారని, సమయానికి రోగికి అందించాల్సిన వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల్లో లేనిపోని అబద్దపు అపోహలతో భయాన్ని పెంచి తమ సొంత క్లీనిక్స్ కి తరలించుకుం టున్నారన్నారు. ప్రధానంగా మెడికల్ మాఫియాగా మారిన వైద్య వృత్తి ఫార్మ కంపెనీలతో జతకడుతూ తక్కువ ధరకు అమ్మాల్సిన మందులను బ్రాండుల పేర్లతో ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని తెలిపా రు. ఇక్కడి వైద్యులు మనుషులని కరెన్సీ నోట్లు ముద్ర వేసే యంత్రాల్లా భావిస్తూ నోటికి వచ్చిన టెస్టుల పేర్లు చెప్తూ.. చేతికి వచ్చిన ఖరీదైన మందుల రాస్తూ పేద ప్రజలను రాబందుల్లా పీక్కుతింటున్నారని ఆ లేఖలో ఆజాద్ దుయ్యబట్టారు.
భద్రాచలం మెడికల్ మాఫీయాకు హెచ్చరిక
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు వారి సమయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేటాయించకుండా ఇలానే ప్రవర్తిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గిరిజన ప్రాంతమైన భద్రాచలం ప్రాంతంలో సంపాదనే ధ్యేయంగా ప్రయివేటు ఆసుపత్రులను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో నివసించే గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కోట్లకు పడగెత్తిన వైద్యులు, ల్యాబ్, మెడికల్ షాప్ల యజమానులు తమ పద్ధతిని మర్చుకొక పోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.