Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనలో ప్రజలు
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు సింగరేణి ఉపరితల గల నుండి భద్రాద్రి పవర్ ప్లాంటుకు బొగ్గును సరఫరా చేసే ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. రోజుకు 14000 టన్నుల బొగ్గును సరఫరా చేసేందుకు భారీ వాహనాలు రాకపోకలు వినియోగిస్తున్నారు. దీనికి తోడు ఇసుక ర్యాంపుల నుండి 24 గంటలు ఇసుకను రాష్ట్రవ్యాప్తంగా ఈ రహదారి ద్వారానే చేరవేస్తుంటారు. దీనికి తోడు ములుగు జిల్లా ఏటూరు నాగారం నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం వరకు నిత్యం బస్సులు ఇతర వాహనాలు రాకపోకలు జరుగుతుంటాయి. ఇంత రద్దీలో ఇసుక లారీలు బొగ్గు లోడు లారీల కారణంగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇదిలా ఉండగా రహదారి పూర్తిగా ధ్వంసం అయింది. ఎదురుగా వచ్చే లారీ నుండి తప్పుకునేందుకు వీలు లేకుండా రహదారి చిద్రమైంది. మణుగూరు ఓసి నుండి ప్రధాన రహదారికి కలిపే ప్రాంతంలో రోడ్డు ప్రమాదకరంగా మారింది. బొగ్గు సరఫరా వాహనాల రద్దీతోపాటు విపరీతమైన దుమ్ము లేవడంతో రోడ్డు ప్రమాదకరంగా ఉన్నది. ప్రయాణికులు బిక్కు బిక్కుమంటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మణుగూరు నుండి బీటీపీఎస్ వెళ్లే రహదారి ఓసీ ఫోర్ డౌన్లో కనపడని పెద్ద గొయ్యి ఉన్నది. దగ్గరకు వెళ్లే వరకు కనిపించదు. అనేకమంది ద్విచక్ర వాహనాలు దారులు గుంటలో పడి తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. కొందరికి కాళ్లు చేతులు విరిగి వికలాంగులయ్యారు. ధమ్మక్కపేట పంచాయతీ చిక్కుడు గుంట గ్రామం వద్ద రహదారి మరమ్మతుల పేరుతో మట్టి పోసి వదిలేశారు. వాహనాల రద్దీ కారణంగా విపరీతంగా దుమ్ము లేవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడడం లేదు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్అండ్బీ అధికారులు స్పందించాలని రోడ్డు మరమ్మత్తులు చేయాలని ప్రజల కోరుతున్నారు. సింగరేణి, భద్రాద్రి పవర్ ప్లాంట్ అధికారులు దీనికి బాధ్యత వహించి రోడ్డును బాగా చేయించాలని ప్రజలు ప్రజాసంఘాలు కోరుతున్నాయి.