Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంటి వెలుగు క్యాంపులను విజయవంతం చేయాలి
- వీడియో కాన్ఫరెన్స్లో ఆరోగ్యశాఖ మంత్రి హరీష్, సీఎస్ డా.శాంతి కుమారి
- భద్రాద్రి జిల్లా కలెక్టర్కు ఆదేశం
నవతెలంగాణ-పాల్వంచ
అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కంటి వెలుగు క్యాంపులను విజయవంతం చేయాలని, ఈ నెల 19వ తేది ఉదయం 9 గంటల నుంచి అన్ని జిల్లాలలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించాలని రాష్ట్ర ఆర్థిక వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణపై సోమవారం మంత్రి హరీష్ రావు ఖమ్మం కలెక్టర్ కార్యాలయం నుంచి, సీఎస్ డా.శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్ వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రిజ్వి, కమిషనర్ శ్వేత మహంతి హైదరాబాద్ బీఆర్కె భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ పట్ల తీసుకోవాల్సిన చర్యలను మంత్రి వివరించారు. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 3వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపడుతున్నారని, చాలా ప్రాధాన్యతా కార్యక్రమమని చెప్పారు. పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి సూచించారు. కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు.
జనవరి 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారని, తదుపరి అన్ని జిల్లాలలో జనవరి 19న ఉదయం 9 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు వారి పరిధిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలలో కలెక్టర్, డీఎంహెచ్ఓ వాట్సాప్ గూప్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కంటి వెలుగు బృందాలు రాత్రి బస చేయుటకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఉదయం 8.45 గంటల వరకు తప్పనిసరిగా బృంద సభ్యులు క్యాంపు ఉన్న ప్రదేశాలకు చేరుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. కంటి వెలుగు క్యాంపులు విజయవంతం అయ్యేందుకు పంచాయతీ కార్యదర్శుల, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆర్పీలు, వీఓఏలను భాగస్వామ్యం చేయాలని, క్యాంపు నిర్వహణ ముందస్తు సమాచారం ప్రజలకు తెలియజేసి ప్రతి ఇంటికీ ఆహ్వాన పత్రిక అందించాలని చెప్పారు. ప్రజలు ఉదయం, మధ్యాహ్న సమయాల్లో వచ్చే విధంగా షెడ్యూల్ చేయాలని మంత్రి సూచించారు. ప్రతి వైద్య బృందానికి క్యాంపు నిర్వహణ కోసం అవసరమైన సామగ్రి, మందులు, కళ్ళద్దాలు అందించేలా చర్యలు తీసుకున్నామని మంత్రి చెప్పారు. కంటి వెలుగు ఉచిత శిబిరాలకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా వారి ఆధార్ కార్డు తీసుకుని వచ్చే విధంగా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో క్యాంపుల నిర్వహణ కంటే ముందుగా ఆశా, ఎఎన్ఎంలు పర్యటించి షెడ్యూల్ వివరాలు తెలియజేస్తూ కంటి వెలుగుపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశిం చారు. ఎంపీఓ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, మండల ప్రత్యేక అధికారులు ప్రతి రోజూ వారి పరిధిలో క్యాంపుల నిర్వాహణను పర్య వేక్షణ చేయాలని చెప్పారు. జిల్లా స్థాయిలో డిఎం హెచ్ ఓ, ఇతర ప్రోగ్రాం అధికా రులు విస్తృతంగా పర్యటి స్తూ క్యాంపుల నిర్వహణను తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎస్ డా.శాంతి కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు నిర్వహిస్తున్నందున ప్రణాళిక బద్ధంగా క్యాంపులు నిర్వహించు విధంగా చర్యలు చేపట్టి ప్రజలు కంటి పరీక్షలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొదట విడత కంటి వెలుగు కంటే అదనపు సిబ్బంది ఏర్పాటు ద్వారా ప్రజలకు కంటి వెలుగు క్యాంపులు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలకు సౌకర్యార్థంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్త వహించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఐడీఓసీ నుండి కలెక్టర్ అనుదీప్, జిల్లా వైద్యాధికారి డా.శిరీష, డీఎస్పీ వెంకటేష్ బాబు, డీపీఓ రమాకాంత్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.