Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజాం మిలటరీని గడగడలాడించిన ధీశాలి
- విరోచిత పోరాటంలో వీరమరణం పొందిన ఉద్యమకెరటం
- నేడు 74వ వర్ధంతి
నవతెలంగాణ-ముదిగొండ
భూమి కోసం, భుక్తి కోసం తెలంగాణ పేద ప్రజల విముక్తి కోసం విరోచితంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో 4వేల మంది వీరులు బలిదానమయ్యారు. నైజాం నవాబ్నుగడగడలాడించి మిలటరీ బలగాలను తరిమికొట్టి ప్రజలకు అండదండలు ఇచ్చి ఎర్రజెండాను రెపరెపలాడించిన ముదిగొండ మండల గోకినపల్లి ముద్దుబిడ్డ మచ్చా వీరయ్య. తెలంగాణ సాయుధ పోరాట విరోచిత పోరాటంలో వీర మరణంపొందారు.ముదిగొండ మండలం గోకినపల్లి గ్రామానికి చెందిన మచ్చా వీరయ్య ఉన్నత వర్గానికి చెందిన వారు. ఆంధ్ర మహాసభ ముఖ్య కార్యకర్తగా ఉంటూ 1943-46 మధ్య ఎన్నో ప్రజా సమస్యలపై ఉద్యమాల్లో పాల్గొన్నాడు. 1947-48 నాటికితెలంగాణ సాయుధ పోరాటం ఉదృతం అవుతున్న నేపథ్యంలో అంకుటిత దీక్ష, పట్టుదలతో ధైర్య సాహసాలు ప్రదర్శించి కమ్యూనిస్టు పార్టీకి దళ నాయకుడయ్యారు. ప్రజా సమస్యలపై పని చేస్తూ వారికి రక్షణగా నిలిచాడు. యూనియన్ భూభాగం నుంచి పిండిప్రోలు ప్రాంతంలోని దళాలను కలుపుకుని రహస్య స్థావరాలలో మచ్చా దళ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. నైజా నవాబు మిలటరీ బలగాలను తరిమికొట్టే వ్యూహా లను పన్నారు. కమ్యూనిస్టు పోరాట ఎజెండాపై సమీక్షా సమావేశాలు జరిపి కేంద్ర కృత ప్రజాస్వామ్యాన్ని అమలు పరిచారు. మచ్చా వీరయ్య దళంలో పని చేసే దళ సభ్యులు పేద కుటుంబాలకు చెందిన సాధారణమైన కార్యకర్తలు ఉన్నారు. మచ్చా వీరయ్య వ్యక్తిత్వం నిబద్ధతమైన సిద్ధాంతంలో సాయుధ పోరాట పంధాను ఎంచుకున్నాడు. సభ్యుల నుంచి నిషితమైన విమర్శలను ఆయన సేకరించేవారు. తమ పొరపాట్లను అంగీకరించి భవిష్యత్తులో అలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటానని వాగ్ధానం చేసే ముక్కుసూటి తనం ఆయనది. అందుకే ఆయనను దళ సభ్యులు, సహచరులు, అనుచరులు మచ్చా వీరయ్య అంటే అంతులేని అప్యాయత, విశ్వాసం ఉండేది. మచ్చా వీరయ్య దళంలో గోకినపల్లి గ్రామానికి చెందిన వాసిరెడ్డి లింగయ్య, యరమనేని వెంకటనర్సయ్య, ఆయన భార్య రాజమ్మ, పారుపల్లి పుల్లయ్య, పమ్మి గ్రామానికి చెందిన నారపొంగు లక్ష్మయ్య, రాయబారపు ముత్తయ్య, గోపయ్యలు దళం సభ్యులుగా పని చేశారు. మచ్చా వీరయ్య అనుచరులుగా పత్తు సాహెబ్, మీగడ కోటయ్యలు ఉండేవారు. మండలంలోని బాణాపురం, వెంకటాపురం, ముత్తారం, పమ్మి, కమలాపురం, గంధసిరి, అమ్మపేట, నేలకొండపల్లి ప్రాంతాల్లో కమ్యూనిస్టు గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసి నెహ్రూ సైన్యాలను తరిమితరిమి కొట్టి గ్రామాల్లో కాంగ్రెస్ భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా ప్రజలను ఒక్కటి చేసి ఐక్య ఉద్యమాలు నిర్వహించారు. ప్రజల మధ్యనే ఉంటూ పోరాటాలు కొనసాగిస్తున్న సమయంలో మచ్చా వీరయ్య, వెలగపూడి కృష్ణమూర్తులను నైజా మిలటరీ బలగాలు చుట్టుముట్టారు. మచ్చా వీరయ్య, ఆయన సహచరుడు కృష్ణమూర్తిని బలగాలు చిత్రహింసలకు గురి చేయగా మచ్చా వీరయ్య ఒక్క రహస్యమైనా చెప్పకపోవడం విశేషం. చివరకు రెండు కండ్లు పొడిచినా భయపడని ధైర్యం మచ్చా వీరయ్యది. వీరు తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరవీరుడు గంగవరపు శ్రీనివాస్‌కు ముఖ్య అనుచరులు. నైజాం సైన్యాలు వీరయ్య, కృష్ణమూర్తిని ఖమ్మం రూరల్ ప్రాంతంలో కాచి రాజుగూడెం గ్రామంలో 1949 జనవరి 17న కాల్చి చంపారు. ఆయన మరణం నేటికి 74 ఏండ్లు. ఆయన స్ఫూర్తి ఎందరికో ఆదర్శం. ఆదర్శప్రాయుడు మచ్చా వీరయ్య నిత్యం ప్రజల హృదయాల్లో సజీవంగా ఉంటూ నిలువెత్తు స్థూపమై గ్రామ ప్రజల గుండెలో వెలుగుతున్నాడు. ప్రతి ఏటా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మచ్చా వీరయ్య వర్ధంతి సభలు జరిపి ఆయనకు ఘనంగా నివాల్లర్పిస్తారు.