Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4తరాల దాసరి వంశవృక్ష సమ్మేళనం
- వివిధ ప్రాంతాల నుంచి 600 మందితో
- ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ డాక్టర్ బండి
- అందరిని ఒకచోటికి రప్పించిన వైస్ ఎంపీపీ చిట్టినాయన
- సంక్రాంతి పండుగ రోజున ఒక్కటైన వంశవృక్ష సభ్యులు
నవతెలంగాణ- సత్తుపల్లి
ఒకే వంశవృక్షానికి సంబంధించిన కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరితే అదో మరపురాని అనుభూతి, తాతయ్య, నానమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ, చిన్నాన, పిన్ని, అన్నయ్య, తమ్ముడూ అంటూ నాలుగు తరాలకు (4జీ) సంబంధించిన ఆ కుటుంబ సభ్యులంతా ఒకరినొకరు కలుసుకొని సరదాగా గడిపితే ఆ ఆనందమే వేరు. మనం ఎంత సంపాదించామన్నది ప్రధానం కాదు, కుటుంబ సభ్యులందరితో ఒకరోజైనా ఆనందంగా గడిపితే ఆ అనుభూతిని జీవితంలో మర్చిపోలేం. వయసులో చిన్నవాడయినా ఒక మంచి ఆలోచన రావడమే తరువాయి అన్నట్లుగా అందరిని ఒకేచోట రప్పించేందుకు సత్తుపల్లి వైస్ ఎంపీపీ దాసరి వెంకట్రామిరెడ్డి, అతని కుమారుడు మధు మోహన రెడ్డి సమాయత్తమయ్యారు. అందరూ కలుసుకొనే వేదికను ఖరారు చేశారు. సంక్రాంతి పండుగ రోజున దాసరి వంశవృక్ష కుటుంబ సభ్యులంతా సుమారు 600 మందికి పైగా మండలంలోని సత్యనారాయణపురం రోడ్డులోని దాసరి వారి పామాయిల్ తోటలో ఆదివారం సమ్మేళనమయ్యారు. కార్యక్రమంలో హెటిరో అధినేత, ఎంపీ డాక్టర్ బండి పార్థసారధిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బండిని పిలవడానికి కారణముంది. బండి మాతృమూర్తి దాసరి వారి ఆడబిడ్డ కావడంతో బండి సైతం ఈ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆటాపాటలతో రోజంతా సరదాగా...
దాసరి కుటుంబ సభ్యులు ఈ సమ్మేళన కార్యక్రమంలో ఆనందంగా గడిపారు. చిన్నారులు, యువకులు, యువతులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనంతరం సహఫంక్తి భోజనం చేశారు. సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించిన అందరిని ఒకేచోటకు చేర్చిన తండ్రీకొడుకులు వెకట్రామిరెడ్డిని, అతని కుమారుడు మధుమోహనరెడ్డిని ఎంపీ బండితో పాటు పలువురు కుటుంబ సభ్యులు అభినందించారు. ఇన్ని యేండ్ల కాలంలో తామంతా అందరం కలిసి సమ్మేళనమయింది ఇదే మొదటిసారి అని, ఇకనుంచి ప్రతీ సంక్రాంతికి ఇదే విధంగా దాసరి కుటుంబ సభ్యులమంతా సమ్మేళనమవుతామని మధు తెలిపారు. కార్యక్రమంలో దాసరి ప్రభాకరరెడ్డి, ఒగ్గు కేశవరెడ్డి, దాసరి దివాకరరెడ్డి విజయ దంపతులు, మాధవరెడ్డి, ప్రసాదరెడ్డి పాల్గొన్నారు.