Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
నవతెలంగాణ-చింతకాని
శ్రీలంక, పాకిస్తాన్ దేశాలలో వచ్చిన ఆహార సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకొని భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని, విదేశీ సంస్థల యొక్క ఒత్తిళ్లకు భారత వ్యవసాయ రంగాన్ని బలిచేయొద్దని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నాగులవంచ వంకాయలపాటి రామయ్య ఫంక్షన్ హాల్లో రైతు సంఘం మండల కార్యదర్శి తోటకూర వెంకట నరసయ్య అధ్యక్షతన జరిగిన చింతకాని, బోనకల్ మండల రైతుల అవగాహన సదస్సులో బొంతు రాంబాబు మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయం పేరుతో శ్రీలంకలో, వరదలు మూలంగా పాకిస్తాన్లో ఆహార పంటలు ఉత్పత్తులు తగ్గి ప్రజలకు ఆహారం అందుబాటులో లేక ప్రజల చనిపోయే దుస్థితి ఏర్పడిందని, భారత దేశంలో పాలకులు విదేశీ బహుళ జాతి కంపెనీలకు రైతులు చేతులలో ఉన్న సాగు భూములు, వ్యవసాయ ఉత్పత్తులను అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని, దీనివలన భారతదేశంలో కూడా ఆహార సంక్షోభం తప్పదన్నారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ శక్తుల చొరబాటుకు వ్యతిరేకంగా రైతులు సంఘటితంగా పోరాడాలని కోరారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని వాగ్దానం చేసి ఎరువులు, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి వ్యవసాయం గిట్టుబాటు కాకుండా చేసి రైతుల రుణ భారాన్ని రెట్టింపు చేసిందని, 2013లో భారతదేశంలో రైతు కుటుంబం సగటు అప్పు 47 వేల రూపాయలు ఉంటే 2020 నాటికి 74 వేలకు పెరిగిందని, అప్పులు రెట్టింపు అయినవి తప్ప ఆదాయాలు పడిపోయాయని అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇన్సూరెన్స్ పథకం కార్పొరేట్ కంపెనీలు పైసలు దోచుకునేందుకు ఉపయోగపడుతుందని, 32వేల కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీలు వసూలు చేసి రైతులకు వంట బీమా తిరిగి చెల్లించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంతో సహా 28 రాష్ట్రాలలో విదేశీ పెట్టుబడులు వ్యవసాయ సేవా రంగంలో ప్రవేశిస్తున్నాయని, వ్యవసాయంలోని మిగులును విదేశీ కంపెనీలు తీసుకెళుతున్నాయని, అప్పులు రైతులకు మిగులుస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిఐటియూ నాయకులు మడుపల్లి గోపాలరావు, బోనకల్ మండల కార్యదర్శి తుళ్లూరు రమేష్, అధ్యక్షులు కొమ్మిన్ని నాగేశ్వరరావు, గుడ్డూరి ఉమా, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వత్సవాయి జానకి రాములు, మాదిని రవి, రాచబంటి రాము, కొల్లి నారాయణ తదితరులు పాల్గొన్నారు.