Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
అనివార్య కారణాలతో గత కొన్ని సంవత్సరాలుగా మండల కేంద్రములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలకు రూ.10,000లు నిధులు మంజూరు చేయడం, అలాగే క్రీడా పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు స్థానిక సర్పంచ్ మెస్సు కోటేశ్వరరావు, సెక్రటరీ ఆర్.ప్రవీణ్ కుమార్ అందిస్తామని ముందుకు రావడంతో సోమవారం పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు ప్రారంభించామని ప్రధానోపాధ్యాయుడు భూక్యా వీరన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ క్రీడా పోటీలు పిల్లలకు రెండు రోజుల పాటు మానసిక, శారీరకంగా నూతన ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయని, వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీస్తాయని అన్నారు. దాంతో పాటు పాఠశాల విద్యార్థుల్లో స్నేహ సంబంధాలు పెంపొందుతాయని చెప్పారు. పాఠశాలకు వచ్చిన నిధుల నుంచి వాలీబాల్ కిట్, షెటిల్, టెన్నికాయిట్, క్యారమ్స్, చెస్, తదితర గేమ్స్ మెటీరియల్స్ తీసుకున్నామని, ఈ గేమ్‌లతో పాటు విద్యార్థులకు క్రికెట్, కబడ్డీ, ఖోఖో, క్విజ్, వ్యాస రచన పోటీలు, రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, తదితర పోటీలు సైతం నిర్వహిస్తామని తెలిపారు. జనవరి 26 సందర్భంగా పాఠశాలలో పిల్లలకు స్పోర్ట్స్, గేమ్స్ పునఃప్రారంభం అయ్యేందుకు చొరవ తీసుకుని సహకరించిన సర్పంచ్, సెక్రటరీలకు పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్లు చిరంజీవి, ప్రభాకర్, రాంబాబు, శ్రీనివాస్, యమున, జీ.పీ. సిబ్బంది మల్కపురి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.