Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా
- విద్యుత్ ఏఈకి వినతి పత్రం
నవతెలంగాణ-భద్రాచలం
విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అధిక భారం మోపుతున్న ఏసీడీ చార్జీలను తక్షణమే రద్దు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించి ఏఈకు వినతిపత్రం అందించారు. సంబంధింత సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏఈ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా మాట్లాడుతూ విద్యుత్ శాఖ గత సంవత్సరం అధిక లోడు పేరుతో వేల రూపాయలు వసూలు చేసిందని, మళ్లీ ఇప్పుడు అడిషనల్ కన్స్యూమర్ డెవలప్మెంట్ చార్జెస్ (ఏసీడీ) పేరుతో విద్యుత్ వినియోగదారులపై భారాలు మోపడం సరైనది కాదని అన్నారు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు విద్యుత్ నియంత్రణ మండలి ఇస్తున్న మితిమీరిన స్వేచ్ఛ ఫలితంగా విద్యుత్ వినియోగదారులపై భారాలు అధికమవుతున్నాయని, విద్యుత్ ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగంగానే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. విద్యుత్ మీటర్లు ఇచ్చేటప్పుడే బ్యాంకులో, మీసేవలో వేల రూపాయలు చలానాలు వసూలు చేస్తూ మళ్ళీ ఇప్పుడు కన్జ్యూమర్ దగ్గర అడిషనల్ గా వసూలు చేయడం దారుణమని అన్నారు. ఈ అధిక బిల్లులు వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు, చిరు వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. తక్షణమే విద్యుత్ వినియోదారులపై ఏసీబీ పేరుతో వేస్తున్న అదనపు భారాలను రద్దు చేయాలని విద్యుత్ వినియోగదారుల సదస్సు నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, సున్నం గంగా, కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకటరెడ్డి, బండారు శరత్ బాబు, పి.సంతోష్ కుమార్, ఎన్ లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు ఎం.నాగరాజు, డి.సీతాలక్ష్మి, యు.జ్యోతి, సిహెచ్ మాధవరావు, ఎస్డీ ఫిరోజ్, ఎస్.రామకృష్ణ, కోరాడ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ చేగొండి శ్రీనివాస్, భూపేంద్ర, డివైఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు సతీష్, ప్రేమ్ కుమార్, సీనియర్ నాయకులు బిబిజి తిలక్, బీజెఎల్పి దాసు తదితరులు పాల్గొన్నారు.