Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్జి టి.శ్రీనివాసరావు
నవతెలంగాణ-ఖమ్మం లీగల్
దివ్యాంగులకు సమాజం చేదోడు వాదోడుగా ఉండాలని ఈ విషయంలో రోటరీ క్లబ్ వారు చేస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగులకు చట్టాలపై అవగాహన మరియు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో న్యాయ సేవల విషయంలో ఖమ్మం జిల్లాను అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షించారు. దివ్యాంగులు ఉచిత న్యాయ సహాయానికి అర్హులని వారికి వారి అర్హమైన అన్ని విషయాలలో సమాన అవకాశాలను కల్పించడానికి న్యాయ సేవా సంస్థ సహాయం చేస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులకు మూడు చక్రాల సైకిల్, కత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో న్యాయ సేవా సంస్థ న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ జావేద్ పాషా, రొటేరియన్లు జగన్నాథం మల్లాది వాసుదేవరావు, అక్బర్ పాషా, ఐతం రవీంద్ర, ఇమ్మడి లక్ష్మీనారాయణ ఎం కన్నాంబ పాల్గొన్నారు.