Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంటి పరీక్షలతో సరి, శాశ్వత చికిత్సలు ఏవి..
- తొలివిడత జిల్లాలో నిలిచిపోయిన కంటి శస్త్ర చికిత్సలు
- 4లక్షల 80 వేల మందికి కంటి పరీక్షలు
- 523 మందికి మాత్రమే శస్త్ర చికిత్సలు
నవతెలంగాణ-పాల్వంచ
రాష్ట్ర ప్రభుత్వం కంటి వ్యాధిగ్రస్తులు లేకుండా చేయాలనే లక్ష్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. తొలివిడతలో ఆశించిన స్థాయిలో లక్ష్యం నెరవేరలేదని తెలుస్తోంది. మలివిడతలోనైనా పూర్తిస్థాయిలో శస్త్ర చికిత్సలు చేసి లక్ష్యం నెరవేరే దిశలో పయనిస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది.
జిల్లాలో తొలివిడతలో బాగంగా ఇప్పటికి 4లక్షల 80 వేల మందికి కంటి వెలుగు వైద్య శిబిరాలలో కంటి పరీక్షలు నిర్వహించి ద్వితీయ శ్రేణి శుక్లాలు పెరిగిన 19,701 మందికి కంటికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించారు. వారందరికీ పాల్వంచలోని ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య కేంద్రంలో శాస్త్ర చికిత్స చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పటివరకు కేవలం 523 మందికి మాత్రమే కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. 2018 డిసెంబర్ 15 నుండి జిల్లాలో కంటి వెలుగు శస్త్ర చికిత్సలు నిలిపివేశారు. ఎందుకు శస్త్ర చికిత్సలు నిలిపివేశారో తెలియడం లేదు. అధికారులు మాత్రం కంటి శస్త్ర చికిత్సలు జరుగుతున్నట్లు చెబుతున్నా ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు మాత్రం కంటి వెలుగు ఆపరేషన్లు చేయడం లేదని చెబుతున్నారు.
జిల్లాలో కంటి వెలుగు సాగుతుందిలా..
రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 15వ తేదీన తొలి విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటి వరకు 2070 గ్రామాలు 66 వార్డుల్లో 4లక్షల 80 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 1,81,498 మంది పురుషులు, 2,18,541 మంది మహిళలు 41 మంది ఇతరులు కంటి పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 48825 మంది ఎస్సిలు, 179746 మంది ఎస్టీలు, 143559 మంది బిసిలు 24927 మంది ఓసిలు, 3023 మంది మైనార్టీలు కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో రీడింగ్ గ్లాసులు అవసరం ఉందని గుర్తించి 88338 మందికి గ్లాసులు అందజేశారు. వారిలో 18117 మంది 40 సంవత్సరాలలోపు వారే కాగా 7022 మంది 40 సంవత్సరాలు పైబడినవారున్నారు. జిల్లా స్థాయిలో కంటి శుక్లాలు పెరిగి శస్త్ర చికిత్స అవసరం అని గుర్తించిన 19701 మందిని ఎల్వి ప్రసాద్ ఆసుప త్రిలో ఆపరేషన్లకు పంపారు. కానీ వారిలో 2018 డిసెంబర్ 15వ తేదీ వరకు కేవలం 523 మందికి మాత్రం కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఆ తర్వాత శస్త్ర చికిత్సలను నిలిపివేశారు. దీంతో ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగుతో తమకు కంటిచూపు ప్రాప్తిస్తుందని ఆశించిన అభాగ్యులకు నిరాశే మిగిలింది. కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో 10336 కంటిలోని నల్లపొర నరాల సమస్య ఉందని గుర్తించి వారికి మెరుగైన వైద్య పరీక్షల నిమిత్సం కార్పోరేట్ వైద్య శాలలకు రెఫర్ చేయడం జరిగింది. ఎంత మందికి చికిత్స అందింది తెలియరాలేదు. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు ఆశించిన రీతిలో లభించినట్లు లేదు. మలివిడత లోనైనా పూర్తిస్థాయిలో లక్ష్యం నెరవేర్చాలని కంటి చూపు ప్రాప్తిస్తుందని ఆశించిన అభాగ్యులకు వెలుగు నింపాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాలను ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేసిందనే విమర్శల నుండి బయటపడాలంటే పూర్తి స్థాయిలో ఆపరేషన్లు పూర్తి చేసి 100 కు 100 శాతం లక్ష్యం నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు.