Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వలాభం కోసం కొందరు సొంత ఇంటి లాంటి పార్టీకి నిప్పు పెడుతున్నారు
- పరామర్శలంటూ కుటిలయత్నాలు
- మున్సిపల్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే హరి ప్రియ
నవతెలంగాణ-ఇల్లందు
నియోజకవర్గ అభివృద్ధే శ్వాస ధ్యాస అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి మారానని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆలోచించి పార్టీ మారానని ఎమ్మెల్యే గుర్తు చేశారు. నేడు అందుకు భిన్నంగా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కొందరు వ్యక్తులు నియోజకవర్గంలో సొంత ఇంటి లాంటి పార్టీని చీల్చడం కోసం నియోజకవర్గంలో తిరుగుతున్నారని అటువంటి వారిని ఇల్లందు ప్రజలు విశ్వసించరని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. స్థానిక మార్కెట్ యార్డులో సోమవారం మున్సిపల్ పాలకవర్గం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళన సభకు విశేష స్పందన భారీగా ప్రజలు హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేడు పరామర్శలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో నియోజకవర్గంలో తిరగడం విడ్డూరంగా ఉందన్నారు. కష్టకాలంలో ప్రజలను గాలికి వదిలేసి కేవలం తమ స్వలాభం కోసం నేడు ప్రజలకు దగ్గర అవ్వాలని ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తే ప్రజలు ఆదరించరన్నారు. అంతేకాకుండా ఇల్లందు నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి మరి కొంతమంది వ్యక్తులు కూడా ఆత్మీయ సమ్మేళనా లంటూ పరామర్శలు అంటూ నియోజకవర్గంలో తిరుగుతుండడం ఎవరు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ని ప్రతి కుటుంబం తమ గుండెల్లో దాచుకున్నారని ఎమ్మెల్యే అన్నారు.
మున్సిపాలిటీ పరుగులు : రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచాం
గత మూడేండ్లుగా ఇల్లందు మున్సిపల్ పాలకవర్గ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులలో ఎంతో అభివృద్ధి జరిగిందని గతంతో పోలిస్తే అభివృద్ధిలో ఇల్లందు మున్సిపాలిటీ పరుగులు పెడుతూ తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానం సాధించి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఆదర్శ మున్సిపాలిటీగా అవార్డు అందుకోవడం జరిగిందని అన్నారు. ఈ ఘనతలో మున్సిపల్ పాలకవర్గంతో పాటు ఇల్లెందు పట్టణ ప్రజల సహకారం కూడా ఎంతో ఉందని తెలియజేశారు.. ఇల్లందు పట్టణంలో జరుగుతున్న అనేక అభివృద్ధి ఆ నాటితో పోలిస్తే ఈనాడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అందులో ప్రధానమైనవి బస్ డిపో, సెంట్రల్ లైటింగ్, ఇల్లందు పట్టణ ప్రధాన రహదారి అని ఎమ్మెల్యే అన్నారు. వైద్య రంగంలో కూడా ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలను వైద్య విధాన పరిషత్లోకి మార్చి నేడు ఏడుగురు వైద్య సిబ్బందితో అనేక మెరుగైన వైద్య సదుపాయాలతో ఇల్లందు ప్రజలకు అందుబాటులోకి తీయడం జరిగిందన్నారు. గత పాలకులు అభివృద్ధిని మరిచారన్నారు. సభలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరిసింగ్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షకార్యదర్శులు మనోహర్ తివారి, పర్చూర్ వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.