Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేర సమీక్షా సమావేశం ఎస్పీ
నవతెలంగాణ-కొత్తగూడెం
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీ డాక్టర్ వినీత్.జి అన్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలను ఇతర శాఖల అధికారులతో సంప్రదించి పట్టిష్టంగా అమలు చేయాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న కేసులు సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి కన్విక్షన్ రేటును పెంచాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దొంగతనాల నివారణలో సీసీ కెమెరాల ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ నేను సైతం కార్యక్రమంలో భాగంగా తమ తమ ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా వారిని భాగస్వాములను చేయాలని కోరారు. దొంగతనం కేసులలో నిందితులను పట్టుకొని చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేకూరేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం డిసెంబర్ నెలలో విధుల పట్ల ప్రతిభ కనబరచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరబాబు, ఇల్లందు డీఎస్పీ రమణ మూర్తి, మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు, పాల్వంచ డిఎస్పీ సత్యనారాయణ, డీసీఆర్బీ డిఎస్పీ నందీరామ్, సిఐ ఉపేందర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.