Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయిల్ ఫాం గ్రోవర్స్ సొసైటీ డీఓ నాయకుల వినతి
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఆయిల్ ఫాం సాగు దారులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ ఫాం గ్రోవర్స్ సొసైటీ బాధ్యులు కె.పుల్లయ్య ఆయిల్ ఫెడ్ అధికారులను డిమాండ్ చేసారు. ఈ మేరకు మంగళవారం ఆయన సొసైటీ తరపున పలువురు బాధ్యులతో ఆయిల్ ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ బాలక్రిష్ణకు సమస్యలతో కూడిన వినతి పత్రం వారి కార్యాలయంలో అందజేసారు. వినతి పత్రంలో తెలిపిన సమస్యలు... పామాయిల్ పండ్ల గెలలు ఫ్యాక్టరీలో జమ చేసుకునేందుకు కేటాయించే ఎఫ్-కోడ్లు రైతులకు జాప్యం లేకుండా జారీ చేయాలి. కౌలు రైతులకు అగ్రిమెంట్ ప్రకారం ఎఫ్-కోడ్లు జారీ చేయాలి. నకిలీ ఎఫ్-కోడ్లు తొలగించాలి. భూమి రికార్డులతో ముడి పెట్టకుండా తెలంగాణ రాష్ట్రంలోని భూమిలో పామాయిల్ మొక్కలు నాటిన ప్రతి రైతుకు ఎఫ్-కోడ్ కార్డులు ఇవ్వాలి. ధరణి పాస్ బుక్ లేని రైతులకు ఆన్లైన్ లేదా మాన్యువల్ పహాణి, ఏ ఇతర రికార్డు ఆధారం వున్నా రాయితీపై రైతులకు మొక్కలు అందజేయాలి. పామాయిల్ మొక్కలు ఇవ్వడానికి డ్రిప్ తప్పని సరి చేయకుండా రైతుల ఇష్టానికి అవకాశం ఇవ్వాలి. పామాయిల్ నాటిన మూడేళ్ల వరకు అంతర పంటలు వేసుకునే వీలుంది. ఈ సమయంలో పామాయిల్ పంటకు ఉపయోగించే డ్రిప్ ఉపయోగం వుండదు. హార్టికల్చర్ శాఖ ఉత్తర్వులు ప్రకారం ఎకరాకు 60 మొక్కలు ఇవ్వాలి. పామాయిల్ మొక్కలు లోడింగ్, అన్ లోడింగ్‌లో కొన్ని మొక్కలు దెబ్బతిని అధికంగా చనిపోతున్నాయి. వీటి స్థానంలో మొక్కలు నాటు కోవడానికి ఒక్కో మొక్క ధర రూ.20 కే రైతులకు అందజేయాలి. క్షేత్ర స్థాయి సిబ్బంది క్షేత్ర పరిశీలన చేసి అవసరమైనన్ని మొక్కలు ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో తుమ్మ రాంబాబు, ఆళ్ళ నాగేశ్వరరావు, తగరం జగన్నాధం, గడ్డం వెంకటేశ్వరావు, కలపాల పాంచయ్య, యర్ర రామకృష్ణ, తోట వీర్రాజు, పాకనాటి నాగేశ్వరరావు, వెంకటేశ్వరావు, ఎలికా సత్యనారాయణ పాల్గొన్నారు.