Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమ్మాయిల పట్ల వివక్ష చూపకూడదు
- జాతీయ బాలిక దినోత్సవ వేడుకలలో కలెక్టర్
నవతెలంగాణ-పాల్వంచ
సమాజంలో అందరూ సమానమేనని, అమ్మాయిల పట్ల వివక్ష చూపకూడదని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ బాలిక దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి బాలికల సంరక్షణ పై ఏర్పాటు చేసిన ప్లెడ్జి ఫ్లెక్సీపై సంతకం చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఆయన జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సమాజం ఎంతో పురోగతి చెందిందని ఆడపిల్ల పుడితే భారంగా భావించే సమాజం నుండి ఆడపిల్లే కావాలని కోరుకునేంత పురోగతి సాధించాని చెప్పారు. ఈ రోజున ఆడపిల్లల పట్ల వివక్ష చూపమని ప్రతిజ్ఞ చేసి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని చెప్పారు. అందరూ సమానమేనని వివక్షత లేని సమాజం కావాలని చెప్పారు. ఆడపిల్లలే అన్న భావన ప్రతి ఒక్కరిలో తొలగిపోవాలని చెప్పారు. ఆడపిల్లలను తక్కువ అంచనా వేయొద్దని నేడు బాలురతో సమానంగా అన్ని రంగాలలో బాలికలు రాణిస్తున్నారని చెప్పారు. అనంతరం క్రీడలు, కరాటే, నృత్య పోటీలలో రాణిస్తున్న విద్యార్థినులకు మెమెంటోలు, ప్రశంసా పత్రాలును అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలను వీక్షించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనీన, సీడీపీఓలు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బాలికల సంరక్షణ కోసం పాటుపడాలి
కొత్తగూడెం : బాలికల సంరక్షణ కోసం పాటుపడాలని జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి జి.భానుమతి అన్నారు. మంగళవారం స్థానిక పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని సింగరేణి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ఈ బాలికా దినోత్సవం రోజున అవగాహన కల్పిస్తారని తెలిపారు. సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి, బాలిక శిశువు గురించి అసమానత్వం విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, గౌరవం, బాల్య వివాహంల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనుబ్రోలు రాంప్రసాదరావు, సీనియర్ న్యాయవాదులు కటికం పుల్లయ్య, లక్కినేని సత్యనారాయణ, లీగల్ సర్వీసెస్ సభ్యులు తోట మల్లేశ్వరరావు, మెండు రాజమల్లు, ఎండి సాదిక్ పాషా, మునిగడప వెంకటేశ్వర్లు, సింగరేణి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సాయి సుధ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించు కొని బండారుగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం బాలిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బెక్కంటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ పంచాయతీ కార్యదర్శి లిడియా మాట్లాడారు. ఉపాధ్యాయులు ఎం.సరోజినీ, ఏ.వి.సీతారాం, అంగన్వాడీ ఉపాధ్యాయులు కే.భద్రమ్మ, వి.నరసమ్మ, పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో...
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ ఎల్.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడారు. శ్రద్ధగా చదువుకొని మంచి భవిష్యత్తును రూపుదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి : మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ కవిత ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ, సర్పంచ్ పద్మ, ఎంపీపీ లలిత, జడ్పీటీసీ భారత లాలమ్మ(లావణ్య), పాటశాల ఛైర్మెన్ చిన్న లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ప్రభుత్వ ఆదేశాలు మేరకు బాలికల ఆత్మ రక్షణ కోసం పవన్ కుమార్ ఆధ్వర్యంలో బాలికలకు కారాటి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాటశాల టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
చండ్రుగొండ : బాలికల విద్యను తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఎంఈఓ సత్తెనపల్లి సత్యనారాయణ అన్నారు. కస్తూరిబా గాంధీ బాలికల వసతి గృహంలో బాలికల దినోత్సవం జరుపుకున్నారు. విద్యార్థులు నిర్వహించే సంస్కృతిక, విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కృష్ణారావు, వసతి గృహ స్పెషల్ ఆఫీసర్ కాంతా కుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పినపాక : సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు, లింగవివక్షను ఎదుర్కోవడం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలని ఈ బయ్యారం జిల్లా పరిషత్ హై స్కూల్ లో హెడ్మాస్టర్ మువ్వా వెంకటేశ్వరరావు, పినపాక జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్మాస్టర్ రాంగోపాల్ అన్నారు. బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాలలో క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.