Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 39 నెలలుగా హాస్టల్ వర్కర్ల అవస్థలు
- ఖాళీ కంచాలతో గిరిజన సంక్షేమ శాఖ
- కమిషనర్ కార్యాలయం ఎదుట హాస్టల్ వర్కర్ల ధర్నా
నవతెలంగాణ-భద్రాచలం
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు నెల నెల జీతాలు....గిరిజన హాస్టల్ కార్మికులకు మాత్రం 39 నెలలుగా వేతనాలు లేక పస్తులు ఉంటున్నారని ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే.వెంకటేష్ ప్రశ్నించారు. గిరిజన హాస్టల్, ఔట్ ట్సోర్సింగ్, డైలీ వేజ్ కార్మికులు హైదరాబాదులోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఖాళీ కంచాలతో మంగళవారం ధర్నా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జనవరి మూడో తేదీ నుండి నిరవధిక సమ్మె చేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులు హైదరాబాదులో కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జే.వెంకటేష్ మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాల బడ్జెట్ రూ.9 కోట్ల చెక్కును ఆర్థిక శాఖ నుండి వెంటనే క్లియరెన్స్ ఇచ్చి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే డైలీ వేజ్ కార్మికుల వేతనాలు చెల్లింపు కోసం విడుదల చేసిన రూ.13 కోట్ల బడ్జెట్‌కు ఆర్థిక శాఖ ఈకుబేర్ ద్వారా విధించిన బడ్జెట్ ఫ్రీజింగ్‌ను వెంటనే తొలగించాలని డైలీ వేజ్ వర్కర్లకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల జీతాల చెల్లింపుకు లేని ఫ్రీజింగ్ కార్మికుల వేతనాల చెల్లించటానికి ఎందుకు పెడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బకాయి వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం తీవ్రమైన జాప్యం చేస్తుందని విమర్శించారు. చేసిన పనికి జీతాలు చెల్లించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని వేతనాలు చెల్లింపులు చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆయన విమర్శించారు. గిరిజన కార్మికుల ఆకలి బాధలు ముఖ్యమంత్రికి, మంత్రులకు వినిపించడం లేదా అని గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ డైలీ వేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు ప్రశ్నించారు. ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ అధికారులు గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. చనిపోయిన కార్మికుల కుటుంబాల వారికి డైలీ వేజ్ వర్కర్‌గా ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన కార్మికులు చేస్తున్న పోరాటం పట్ల గిరిజన ఎమ్మెల్యేలు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. వేతనాలు చెల్లింపుల సమస్యను పరిష్కారం చేసి ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాలు చెల్లింపులకు అవసరమైన బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. వేతనాల సమస్య పరిష్కారం అయ్యేంతవరకు హాస్టలు వర్కర్ల పోరాటం కొనసాగుతుందని ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతున్న నిరవధిక రేపటి నుంచి ఖమ్మం, ములుగు జిల్లాల్లో కూడా ప్రారంభమవుతుందని బి.మధు తెలిపారు. ధర్నా కార్యక్రమానికి హాస్టల్ డైలీ వేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కే.బ్రహ్మచారి, అధ్యక్షులు నాయకులు రత్నం రాజేందర్, పాయం ముత్తయ్య, రాములు, జలంధర్, పద్మ, లక్ష్మణ్ నాయక్, తిరుపతమ్మ, కాకా సమ్మక్క, భద్రమ్మ, జోడలక్ష్మి, రామారావు, రాము, నాగమణి తదితరులు పాల్గొన్నారు.