Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేయవద్దు
- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే డ్రామాలు ఆపాలసి ఉంటుందని, కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేయవద్దని, కాగితాల మీదనే అభివృద్ధి చూపిస్తున్నారు కానీ, పనులన్నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే చందంగా ఉన్నాయని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఘాటుగా విమర్శించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం మున్సిపాలిటీ అభివృద్ధికి వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ, అభివృద్ధి మాత్రం ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. గతంలో కోట్ల రూపాయల నిధులు మంజూరు అయినట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. పట్టణ సుందరికరణ, నియోజకవర్గం వెలిగిపోతుందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని తెలిపారు. ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు. పురపాలక వార్డుల్లో ఇప్పటికీ కనీస సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపించారు. కొత్తగూడెం జర్నలిస్టులందరికీ ప్రభుత్వ జిఓ, నిబంధనల ప్రకారం 250 గజాల చొప్పున ఇండ్ల స్థలం ఇవ్వాలని, ఈ విషయంలో రాజకీయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వారికి కేటాయించిన భూమిలో కొంత భాగాన్ని రాజకీయ నాయకులు కబ్జా చేసేందుకు కుట్రలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాగుల రవికుమార్, చెనిగారపు నిరంజన్ కుమార్, అల్లకొండ శరత్, ధనుంజరు, ఆకుతోట పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.