Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్
- డా.గుగులోత్ శంకర్ నాయక్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
విద్యార్థులు సమాచార హక్కు చట్టంపై సంపూర్ణ అవగాహనతో ఉండాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డా. గుగులోతు శంకర్ నాయక్ అన్నారు. కోరిన 30 రోజుల వ్యవధిలో సమాచారం ఇవ్వాలన్నారు. ఎస్.ఆర్. అండ్.బి.జి.ఎన్.ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సమాచార హక్కు- చట్టం 2005పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పట్టుదల ఉంటే దేన్నయినా సాధించ వచ్చనే సంకల్పంతో ముందుకు వెళ్లాలన్నారు. తాను మారుమూల తండాలో జన్మించి ఖమ్మం జిల్లాలో ఇదే ప్రభుత్వ కళాశాలలో విద్యనభ్యసించి పట్టుదలతో నేడు రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ చైర్మన్ స్థాయికి ఎదిగానన్నారు. విద్యతోనే గౌరవం లభిస్తుందని, విద్యార్ధి దశ నుండే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. అధ్యాపకులు విద్యార్థుల్లో ఉన్న సజనాత్మకత, ప్రతిభలను వెలికి తీసే విధంగా విద్యాబోధన చేయాలన్నారు. సమాచార హక్కు చట్టం. సామాన్యుని చేతిలో వజ్రాయుధం లాంటిదన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారీతనంతో ప్రజలు కోరిన సమాచారాన్ని సెక్షన్ (3) ప్రకారం తారతమ్యం లేకుండా 30 రోజుల వ్యవధిలో ఇవ్వాలన్నారు. దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని అందించాలని సెక్షన్ 7(1) ప్రకారం ఇవ్వని పక్షంలో మొదటి అప్పీల్ చేసుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. 30 రోజుల వ్యవధిలో సమాచారం ఇవ్వని పక్షంలో సెక్షన్ 19 (1) ప్రకారం మొదటి అప్పీల్ చేసుకుంటే మొదటి అప్పిలేట్ అధికారి సమాచారం విచారణ చేపట్టి ఇప్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మొదటి అప్పిలేట్ అథారిటి పరిష్కారం చేయకపోతే సెక్షన్ 19(3) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషనర్ లు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. 30 రోజుల వ్యవధిలో సమాచారం అందించే విధంగా కమిషన్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పౌరులకు సమాచారం అందచేయడం, సత్వర పరిష్కారానికి రాష్ట్ర కమిషన్ చర్యలు చేపడుతుందన్నారు. దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్ర కమిషన్ సెకండ్ అప్పిలేట్ ఆధారిటికి దరఖాస్తు చేస్తే, రాష్ట్ర కమిషన్ మూడు నుంచి ఆరు నెలల లోపే కేసు విచారణ చేపట్టి సమాచారం అందిస్తుంది అన్నారు. సమాచార హక్కుచట్టంపై యువతకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటుహక్కు ఎలా ఉపయోగించుకుంటున్నామో, సమాచారహక్కు చట్టాన్ని కూడా అదే తరహాలో సర్వినియోగ పరుచుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా?మహ్మద్ జాకిరుల్లా, అధ్యాపకులు బి. వెంకటేశ్వరరావు, రత్న ప్రసాద్, డా?జాన్ మిల్టన్, సీతారాం, గోపి, రమేష్, నాగూరు, సత్యవతి, విద్యార్థులు తదితరులు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.