Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17వేల ఎకరాలకు సాగునీరు
- విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
నవతెలంగాణ-అశ్వాపురం
మండల పరిధిలోని బిజీ కొత్తూరు గ్రామంలో సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ అనుబంధంగా మండలంలోని ఆయకట్టకు నీరు అందించేందుకు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అదనపు ఆయకట్టు పంప్ హౌస్కు రూ.సుమారు 25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న పనులకు ఆదివారం ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మారెళ్ళపాడు ఎత్తిపోతల పథకంతో మండలం సస్యశ్యామలం కానున్నదన్నారు. మండలాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషితో మండలంలో 17 వేల ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప లక్ష్యంతో లిఫ్టుకు రూపకల్పన చేసి నిధులు మంజూరు చేసి నేడు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువకు అనుబంధంగా పంప్ హౌస్ నిర్మించనున్నారు. గొందిగూడెం గ్రామంలో డెలివరీ సిస్టం ఏర్పాటు చేసి పంప్ హౌస్ నుంచి పైప్ లైన్ ద్వారా డెలివరీ సిస్టంకు తరలిస్తారన్నారు. అక్కడ నుండి గ్రావిటి ద్వారా ఎడమ కాలువ కుడి కాలువ ద్వారా మండలంలోని ప్రధాన సాగునీటికి అవసరమైన మండలంలోని అన్ని చెరువులలోకి, కుంటలకు నీరు చేరు తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సూది రెడ్డి సులక్షణ, వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రం, ఎంపీటీసీ తాటి పూజిత, మొండకుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి రామ చంద్రపురం, నెల్లిపాక బంజరు, సీతారాంపురం, గొల్లగూడెం సర్పంచులు అశోక్, వెంకటరమణ, సుజాత, కొల్లు మల్లారెడ్డి, తుమ్మలచెరువు ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.