Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్లాస్టింగ్ గ్యాలరీ రజాక్
నవతెలంగాణ-మణుగూరు
దక్షిణ భారతదేశంలో వెలుగులు నింపుతున్న సిరుల తల్లి సింగరేణి ముద్దుబిడ్డ ఎండి.రజాక్ పాషా అనేక రికార్డులు నెలకొల్పాడు. 34 సంవత్సరాలుగా సింగరేణిలో వివిధ హౌదాలలో పదవి బాధ్యతలు నిర్వహించి నేడు ఎస్ఎంఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేయుచున్న రజాక్ పాషాకు నవతెలంగాణ ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నది. మహమ్మద్ రజాక్ పాషా 1962లో కొత్తగూడెంలో జన్మించారు. తమ తాత, తండ్రి, బావలు తనతో పాటు అన్నయ్యలు సింగరేణియులే నాలుగో తరం కుటుంబ సభ్యులు కూడా సింగరేణిలో విధులు నిర్వహిస్తున్నారు. సింగరేణి కుటుంబంగా పేరు గాంచింది. డిప్లమా ఇన్ మైనింగ్ పూర్తి చేసి గోదావరిఖనిలో ఓవర్ మెన్‌గా సింగరేణిలో ప్రవేశించి 20 సంవత్సరాలు బ్లాస్టింగ్ గ్యాలరీ టెక్నాలజీ ఉపయోగించి అత్యుత్తమ ఉత్పత్తిని సాధించడానికి ఆయన కృషి అనలేనిది. ఉత్పత్తి సాధించడంలో గతంలో ఉన్న ఉత్పత్తి రికార్డులను బద్దలు కొట్టాడు. సింగరేణిలోనే అత్యు త్తమ ఉత్పత్తిని సాధించి అనేక మైలు రాళ్లను అధిగ మించాడు. సింగరేణిలోనే బిజీ ప్యానెల్ ద్వారా రికార్డులు సాధించిన ఘనత ఈయనకు దక్కుతుంది. సింగరేణి వ్యాప్తంగా రజాక్ పాషా బ్లాస్టింగ్ గ్యాలరీ రజాక్‌గా పేరు పొందాడు. బిజీ ప్యానెల్ రజాక్‌గా కార్మికులకు అధికారులకు సుపరిచితుడు. 2014లో ఎస్ఎంఎస్ ప్లాంట్‌లో ఇన్చార్జిగా పదవి బాధ్యతలు చేపట్టి 20,000 టన్నులుగా ఉన్న ఉత్పత్తిని 50,000 టన్నులుగా అభివృద్ధి చేశాడు. ఎస్ఎంఎస్ ప్లాంటును ఈఎంఈ ప్లాంట్ ా మార్చడంలో ఆయన కృషి, శ్రమ అనన్య సామాన్యమైనది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా పేలుడు పదార్థాల కొరత ఏర్పడ్డది. ముడిసరుకు రవాణా ఆగిపోవడంతో ప్రతిష్టమైన ప్రణాళికలతో బాంబే కంపెనీలతో మాట్లాడి ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ముడి పదార్థాల సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషించారు. మణుగూరు కే కాకుండా కొత్తగూడెం, ఇల్లందు ఉప్పరి తలగనులకు నిరంతరా యంగా పేలుడు పదార్థాలను ఉత్పత్తి చేసి అందించి అధికారుల ప్రశంసలు పొందారు. రజాక్ పాషా సతీమణి సల్మా ఆదర్శ గృహిణిగా యోగా గురువుగా పేరు పొందారు. రామగుండం, ఇల్లందు, మణుగూరు తదితర ప్రాంతాల్లో సింగరేణి లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు శిక్షణ ఇచ్చి పేరు పొందారు. అతని కుమారులు ఫయద్ సోయల్ ఐటీ నిపుణులుగా కెనడా అమెరికాలలో స్థిరపడ్డారు. తండ్రికి తగ్గ తనయులుగా సొంత స్టార్టపులను నిర్వహిస్తున్నారు.