Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు, రాష్ట్ర అధికారులతో వీసీలో కలెక్టర్ వీపీ గౌతమ్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఫిబ్రవరిలో పోడు భూముల పట్టాలను అర్హులకు పంపిణీ చేసేందుకు అధికారులు సన్నద్దం కావాలని రాష్ట్ర స్త్రీ- శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి మంత్రి, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర స్థాయి ఉన్నతస్థాయి అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో పోడు భూములు, కంటి వెలుగు, మన ఊరు - మన బడి, పామ్ ఆయిల్ సాగు, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, జి.ఓ. 58, 59, ఐడిఒసిలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కలెక్టర్ లు ముందస్తుగా ఎస్.డి.ఎల్.సి పూర్తి చేసిన దరఖాస్తులను ఆమోదించి ఫిబ్రవరి 6 నాటికి పోడు భూముల పట్టాలు ప్రింటింగ్ పూర్తి చేసి ముఖ్యమంత్రి నిర్ణయించే తేది నుండి పంపిణీ కోసం సన్నద్ధంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ.. పోడు భూముల పట్టాల పంపిణీకి సూచనల ప్రకారం సంసిద్దంగా ఉన్నట్లు తెలిపారు. మన ఊరు-మన బడి కింద పూర్తిస్థాయిలో పనులు చేపట్టిన మోడల్ పాఠశాలలను పండుగ వాతావరణం లో పునఃప్రారంభం చేస్తామన్నారు. కంటి వెలుగు కార్యక్రమంపై ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. జీవో 58 కింద 3198, జీవో 59 కింద 1,617 దరఖాస్తులు అమోదించినట్లు తెలిపారు. జిల్లాలో టీచర్ల బదిలీలు పదోన్నతుల సీనియార్టీ జాబితా, ఖాళీల జాబితా ఆన్ లైన్ లో నమోదు చేశామని, మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి పరిశీలించామని తెలిపారు. ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, డీఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, డిఇఓ సోమశేఖరశర్మ, డిఎంఅండ్హెచ్ఓ డా. బి. మాలతి, డిటిడబ్ల్యూఓ కృష్ణ నాయక్, హార్టికల్చర్ ఏడీ కె. అనిత, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్ పామ్
జిల్లాలో నిర్దేశిత ఆయిల్ పామ్ పంటల సాగు లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ తెలిపారు. ఐడివోసి కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో జిల్లాలో ఆయిల్ పామ్సాగుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. 2023 ఆర్థిక సంవత్సరానికి 12,100 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటాలని లక్ష్యంగా చెప్పారు. జనవరి, 2023 మాసాంతానికి లక్ష్యం 8,500 ఎకరాలకుగాను 28 జనవరి, 2023 నాటికి 7,207.85 ఎకరాలలో (85%) 1,694 మంది రైతుల భూముల్లో ఆయిల్ పామ్ పంటను సాగు చేసినట్లు వివరించారు. ఆయిల్ పామ్ తోటలను సాగు చేసేందుకు నీటివసతి, విద్యుత్ సౌకర్యం ఉన్న భూములు కలిగిన రైతులను గుర్తించాలని తెలిపారు. పురోగతి లేని మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మండలాల వారీగా వ్యవసాయ అధికారులు ఆయిల్ పామ్ పంటల సాగుతో లాభాలు, సబ్సిడీపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఆయిల్‌పామ్ సాగుతో పాటు అంతర పంటలను సాగుచేయవచ్చన్నారు. జిల్లాలో 40 శాతానికి పైగా ఎస్సి, ఎస్టీ రైతులు ఉన్నారని, ఆయిల్ పామ్ సాగుపై వీరిలో చైతన్యం తేవాలన్నారు. ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిం చాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, ఉద్యానవన సహాయ సంచాలకులు కె.అనిత, ఉద్యానవన అధికారులు జి.సందీప్ కుమార్, జి.నగేష్, ఏ.వేణు, పి.అపర్ణ, కె.మీనాక్షి, ఎంఐ ఇంజనీర్ పి.నాగమణి, టీఎస్ ఆయిల్ ఫెడ్ డివిజనల్ అధికారి ఏ.బాలకృష్ణ, గోద్రెజ్ కంపెనీ ఏరియా మేనేజర్ రామకృష్ణ, ఫీల్డ్ అధికారులు పాల్గొన్నారు.
ఆర్అండ్బీ ఇంజనీర్లకు సన్మానం
సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడంలో ఉత్తమ సేవలు అందించిన రోడ్లు భవనాల శాఖ ఈఈ శ్యామ్ ప్రసాద్, ఏఈఈ విశ్వనాథ్, ఎస్ఆర్ఆర్ కంపెనీ బాధ్యులను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఐడిఒసి సమావేశ మందిరంలో సోమవారం ఘనంగా సత్కరించారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా, అనుకున్న దానికంటే త్వరగా పూర్తి చేశారని, వారి సేవలను గుర్తించి సత్కరించినట్లు తెలిపారు. నిర్మాణ కాలంలో ఇల్లు, కుటుంబం విడిచి పనిలో నిమగమయ్యారని తెలిపారు. 3 - 4 జనరేషన్ లకు ఉపయోగపడే భవన నిర్మాణంలో పాలుపంచుకున్నారని అన్నారు. కలెక్టర్ సత్కరించిన వారిలో రోడ్లు భవనాల శాఖ ఈఈ శ్యామ్ ప్రసాద్, ఏఈఈ విశ్వనాథ్ తో పాటు ఎస్ఆర్ఆర్ కంపెనీ డైరెక్టర్ రంగయ్య, సైట్ ఇంజనీర్లు జగదీష్, వెంకటేష్, శ్రీనివాస్, భాను, గోల్కొండ ఫర్నీచర్ కాంట్రాక్టర్ ప్రశాంత్ ఉన్నారు.
మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం
అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, సోమవారం ఐడిఓసి లో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, జిల్లా అధికారులు మౌనం పాటించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30వ తేదీన అమరవీరుల దినోత్సవం చేపడుతున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకొని, వారి జీవితాలలో స్ఫూర్తి పొందాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, డిఆర్వో శిరీష, అధికారులు, పాల్గొన్నారు.