Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాండురంగాపురం నుండి భద్రాచలం వరకు
- రైల్వే లైన్ నిర్మాణానికి ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించాలి
- భద్రాచలం పట్టణాన్ని రామాయణం సర్క్యూట్‌లో చేర్చాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా
నవతెలంగాణ-భద్రాచలం
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భద్రాచలం ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నిత్యం రాముని జపం చేసే బిజెపి కేంద్ర ప్రభుత్వం దక్షిణ అయోధ్యగా విరాసిల్లుతున్న భద్రాచలం అబివృద్ధి పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. భద్రాచలంను రామాయణం సర్క్యూట్‌లో చేర్చాలని, అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పాండురంగాపురం సారపాక రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలం ఎంపీగా డాక్టర్ మీడియం బాబు ఉన్న సమయంలో ఆయన కృషి మేరకు రైల్వే లైన్ సర్వే జరిగినప్పటికీ నేటికీ నిధులు కేటాయించకపోవడం దారుణమని అన్నారు. భద్రాచలంకు ఆనుకుని ఉన్న ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణలో కలిపేందుకు వీలుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేస్తూ పార్లమెంట్లో తీర్మానం చేయాలని అన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ ముంపుతో భద్రాచలంకు పొంచి ఉన్న ప్రమాదంపై కేంద్ర జల సంఘం సిఫారసు మేరకు రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ నిపుణులతో సర్వే చేయించే విధంగా పార్లమెంటులో చర్చించి పరిష్కారం చూపాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు నేటి నుండి జరగబోయే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో భద్రాచలం సమస్యలపై చర్చించాలని విజ్ఞప్తి చేశారు.