Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, పీఎంహెచ్ హాస్టల్ యందు పనిచేస్తున్న డైలీ వేజ్, ఔట్ సోర్సింగ్ కార్మికుల బకాయి వేతనాలు విడుదల చేయాలని గత కొంతకాలంగా సీఐటీయూ ఆధ్వర్యంలో హాస్టల్ వర్కర్లు ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తున్నారు. జనవరి మూడో తేదీ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిరవధిక సమ్మె కూడా ఔట్ సోర్సింగ్ కార్మికులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులు చేస్తున్న పోరాటం పట్ల ప్రభుత్వం ఏమాత్రం స్పందించక పోవటాన్ని సీఐటీయూ తీవ్రంగా ఖండిస్తున్నది. మూడో తేదీ నుంచి జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో తమ సమస్యలను ప్రస్తావించాలని, తమ డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హాస్టల్ వర్కర్లు టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. దానీ పైస్పందించిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గిరిజన సంక్షేమ విద్యారంగానికి తమ శ్రమ ద్వారా సేవలందిస్తున్న హాస్టల్ వర్కర్ల వేతనాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 2వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ నందు నిరాహార దీక్ష చేయటానికి సిద్ధమయ్యారు. కార్మికులు వివిద రూపాల్లో పోరాటాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం మూలంగానే ఎమ్మెల్సీగా కార్మికుల పక్షాన నర్సిరెడ్డి నిరాహార దీక్ష చేస్తున్నట్లు సిఐటియు అనుబంధ తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ డైలీ వేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే.బ్రహ్మచారి, ఏ.హీరాలాల్ పేర్కొన్నారు. రెండవ తేదీన హైదరాబాదులో జరిగే నిరాహార దీక్షలో జిల్లా నుండి ఔట్ సోర్సింగ్, డైలీ వేజ్ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాదిరిగానే జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ స్పందించాలని మూడవ తేదీ నుండి జరిగే శాసనసభ సమావేశాల్లో హాస్టల్ వర్కర్ల సమస్యల పైన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని జిల్లాలోని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు హాస్టల్ వర్కర్స్ తరఫున సీఐటీయూ విజ్ఞప్తి చేసింది.