Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లు
నవతెలంగాణ - భద్రాచలం
ఆర్భాటంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో గ్రామీణ ఉపాధి హామీ ఆహార సబ్సిడీ రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీల పైన భారీ ఎత్తున కోత విధించడం గ్రామీణ ప్రాంత పేదల నోట్లో మట్టి కొట్టిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను నిరసిస్తూ జిల్లా వ్యాప్త ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ఉపాధి హామీకి గత బడ్జెట్లో 89 వేల కోట్ల రూపాయలను కేటాయించిన మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో 60 వేలకోట్ల రూపాయలను మాత్రమే కేటాయించి 40% పైగా నిధులను తగ్గించడం అంటే పనిని కల్పించే బాధ్యత నుంచి తప్పుకోవాలని చూడటమే నన్నారు. దేశంలో 15 కోట్ల కుటుంబాలను ఉపాధికి దూరం చేయడమే అవుతుందని అన్నారు. మన రాష్ట్రంలో 55 లక్షల జాబ్ కార్డులు కలిగిన కుటుంబాల పనిమీద తీవ్రమైన ప్రభావం పడనున్నది గ్రామీణ ప్రాంత పేదలకు ఆహార భద్రతను కల్పించడం కోసం గత సంవత్సరం 2, 87, 194 కోట్లను బడ్జెట్లో కేటాయించిన ప్రభుత్వం ఈ బడ్జెట్లో 1, 97,350 కోట్లకు తగ్గించిందని ఇది జిల్లాకు కూడా తీవ్ర నష్టం అన్నారు.
అంటే సబ్సిడీ బియ్యం, గోధుమలు, పిండి, పామాయిల్ వంటివి అందించే బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తున్నది రైతులకు అందించే ఇన్‌ఫుట్ సబ్సిడీ రెండు లక్షల 25 వేల కోట్లు గత బడ్జెట్లో కేటాయించిన మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో 1,75 వేల కోట్లకు తగ్గించింది. ఒక్క యూరియా పైన నే 15 వేల కోట్లను తగ్గించటం ఆందోళన కలిగిస్తున్నది. గిట్టుబాటు ధరల గురించి చట్టం తీసుకొస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం మాట వరసకు కూడా మాట మాట్లాడకపోవడం రైతుల మీద ఉన్న కపట ప్రేమకు నిదర్శనం. కౌలు రైతులు, పోడు సాగుదారులు, భూ నిర్వాసితుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం మోడీ ప్రభుత్వ కుటిల బుద్ధికి నిదర్శనం అన్నారు. విద్యా, వైద్య, రంగాలపైన గతం కంటే నామాత్రంగా 2000 కోట్లను అదనంగా కేటాయించి చేతులు దులుపుకోవడం దుర్మార్గమైనటువంటి ఆలోచన అన్నారు. తక్షణమే వీటి పైన పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు మచ్చా పేర్కొన్నారు.