Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శం
- ఘన చరిత్ర కలిగిన మార్కెట్ ఖమ్మం ఏఎంసీ
- మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్
- ఏఎంసీ చైర్‌పర్సన్‌గా ప్రమాణం చేసిన దోరేపల్లి శ్వేత, వైస్‌చైర్మన్ అఫ్జల్
నవతెలంగాణ- ఖమ్మం కార్పొరేషన్
రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ పనిచేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కేంద్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు కేంద్రంగా పనిచేస్తుందని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో బుధవారం మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా బాధ్యతలు చేపట్టిన దోరేపల్లి శ్వేత, అఫ్జల్ ప్రమాణస్వీకారోత్సవంలో మంత్రులు మాట్లాడారు. తెలంగాణలో అమల్లో ఉన్న విధానాలు భారత దేశవ్యాప్తంగా అమలైతే దేశవ్యాప్తంగా రైతాంగం బాగుపడుతుందన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి రైతాంగ దృక్కోణం లేదన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ 'అప్‌కీ బాద్ కిసాన్ సర్కార్' అన్నారని తెలిపారు. ఈసారి కేంద్రంలో రైతు రాజ్యం రావాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. రైతు కేంద్రంగా భారత ప్రభుత్వం నడవాల్సిన రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాల గురించి చెప్పి ఓట్లు వేయించాలని కోరారు. రైతులు తలచుకుంటే రైతురాజ్యం రావడం ఏమంత కష్టం కాదన్నారు.
- ఎనుమాముల మార్కెట్‌తో పోటీ పడుతున్నాం: రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఉన్న ప్రత్యేకతను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వివరించారు. వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్‌తో పోటీ పడుతున్నట్లు చెప్పారు. ఖమ్మం మార్కెట్ ఖమ్మం నియోజకవర్గానికి ఓ గుండెకాయ లాంటిదన్నారు. ఇది 121 గ్రామాలకు కాకుండా యావత్ ఖమ్మం జిల్లా, సూర్యాపేట, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ మార్కెట్‌కు వస్తుంటారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మార్కెట్‌కు వచ్చిన ఏ రైతూ ఇసుమంత కూడా బాధపడలేదన్నారు. మార్కెట్ చైర్మన్‌లకు రిజర్వేషన్ పద్ధతి పెట్టిందే కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లకు రొటేషన్ పద్ధతిలో అది కూడా మహిళలకు అవకాశం కల్పించే విధంగా రిజర్వేషన్ సంస్కరణలను కేసీఆర్ చేశారన్నారు. అందువల్లనే బడుగు, బలహీనవర్గాలకు అవకాశం లభిస్తుందన్నారు. ఈసారి జనరల్ మహిళకు రిజర్వ్ అయినప్పటికీ అనేక సందర్భాల్లో ముదిరాజుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో అడగటంతో బీసీ మహిళ శ్వేతకు చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించామన్నారు. నికార్సైన రాజకీయాలకు బీఆర్‌ఎస్ పెట్టింది పేరన్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు ఐదు లక్షల మంది జనాలు వస్తారని అంచనా వేస్తే అంతకుమించి జనం వచ్చారని...బీఆర్‌ఎస్ సత్తా ఏంటో చూపామని అన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా సభ నిర్వహించామన్నారు. పదవులు వస్తాయి పోతాయన్నారు. కానీ ఆ పదవులకు వన్నె తేవడమే ప్రధానమన్నారు.
- రైతులకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టం: దోరేపల్లి శ్వేత, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్
రైతులకు సేవ చేసుకునే అవకాశం రావడం తన అదృష్టమని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్‌పర్సన్ దోరేపల్లి శ్వేత అన్నారు. తనకీ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, అజరులకు కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను మరింతగా ముందుకు తీసుకెళ్తానన్నారు. భవిష్యత్‌లో అందరి సహాయ సహకారాలు, ఆశీస్సులతో ముందు కెళ్తానన్నారు. రైతులు, మార్కెట్ కార్మికులందరూ సంతోష పడేలా పాలన సాగిస్తానన్నారు. అంతకుముందు దోరేపల్లి శ్వేత, వైస్ చైర్మన్ అఫ్జల్‌తో పాటు పాలకవర్గ సభ్యులతో జిల్లా మార్కెటింగ్ అధికారి కోలాహలం నాగరాజు ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రులతో కలిసి పొట్టి శ్రీరాములు రోడ్డు, పంపింగ్‌వెల్ రోడ్డు మీదుగా మార్కెట్ నూతన పాలకవర్గం ర్యాలీగా ప్రమాణ స్వీకారోత్సవానికి తరలివచ్చింది. మేయర్ పునుకొల్లు నీరజ, ఇతర మహిళా ప్రజాప్రతినిధుల జ్యోతిప్రజ్వలనతో ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం మొదలైంది. సభ అనంతరం శ్వేతతో పాటు మిగిలిన పాలకవర్గ సభ్యులు మంత్రులు, ప్రజాప్రతినిధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజ్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజరుకుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్నికృష్ణారావు, బీఆర్‌ఎస్ నగర పాలకసంస్థ ఫ్లోర్‌లీడర్ కర్నాటి కృష్ణ, మార్కెట్ సెక్రటరీ రుద్రాక్షల మల్లేశం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, టీఆర్‌ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు, పాల్గొన్నారు.