Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే, చైర్మన్, వైస్ చైర్మన్లపై కౌన్సిలర్ల ధ్వజం
- చైర్మన్ పార్టీ మారితే అవిశ్వాస తీర్మానం పెడతాం
- కాని అంతకంటే ముందే మున్సిపాల్టీకి రూ.30 కోట్లు ఇవ్వాలి
- వైరా అభివృద్ధి నిరోధకానికి అందరూ బాధ్యులే
- రహస్య సమావేశంలో కౌన్సిలర్లు
నవతెలంగాణ-వైరా
వైరా నూతన మునిసిపాలిటీపై ప్రభుత్వం, జిల్లా ప్రజా ప్రతినిధులు కపటప్రేమ చూపించి ప్రకటించిన నిధులు మంజూరు చేయటం లేదని మునిసిపల్ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. బుదవారం మునిసిపల్ పరిదిలోని సోమవరం గ్రామంలో ఒక మామిడి తోటలో రహస్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు ఎన్నికైన పురుష అభ్యర్థులు, మహిళా సభ్యుల భర్తలు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నిధులు ఖమ్మం కార్పొరేషన్ 2 వేల కోట్లు, సత్తుపల్లి మునిసిపాలిటీ 60 కోట్లు, ఇల్లందు 29 కోట్లు, మధిర 15 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం వైరా మునిసిపాలిటీకి ప్రకటించిన 30 కోట్ల రూపాయలను ఎందుకు విడుదల చేయలేదని సభ్యులు ప్రశ్నించారు. వైరా మునిసిపల్ చైర్మన్ పార్టీకి ఎదురు తిరిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు అయినందున నిధులు ఆపారా అని కూడా ప్రశ్నించారు. మునిసిపాలిటీ అభివృద్ధి చెందకపోవటానికి కారణం జిల్లా మంత్రి, ఎమ్మెల్యే, చైర్మన్, వైస్ చైర్మన్‌లే కారణమని సభ్యులు విరుచుకుపడ్డారు. రహస్య సమావేశం అని ఎవరికి వారు చెప్పినా అందరూ అక్కడ జరిగిన విషయాలను బహిర్గతం చేశారు. వైరా మునిసిపాలిటీ తెలంగాణ లో ఉందా, లేదా అన్నది సభ్యుల ప్రధాన ప్రశ్న. 2018 లో మునిసిపాలిటీ ఏర్పడ్డ తొలినాళ్లలో ఇచ్చిన అర్భన్ డెవలప్మెంట్ నిధులు 20 కోట్లు మినహా వైరాకు ఏ నిధులిచ్చారని ప్రశ్నించారు. చైర్మన్ సహితం నిధులు రాని మాట నిజమేనని, వైరా సమగ్ర వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ఎలా వచ్చిందో, ఎవరు కాంట్రాక్టరో, నేటివరకు మునిసిపాలిటీ కి తెలియని దుస్థితి ఉన్నదని చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మునిసిపాలిటీలో అదనపు విద్యుత్ స్తంభాలకు 78 లక్షలకు ఎస్టిమేషన్ వేసి తీర్మానం చేస్తే ఒక్క రూపాయి రాదని అన్నారు. సమావేశంలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు తప్ప 18 మంది బిఆర్‌ఎస్ సభ్యులే. అయినా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో తమ నిరసన వ్యక్తం చేశారు. ఒకరిద్దరు సభ్యులు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ కాదు వార్డుల్లో ఇప్పటి వరకు మేము చేసిన పనులేమిటి? వార్డు ప్రజలకు సమాధానం ఏమి చెప్పాలి? ఎంతకాలం చెప్పాలనే ఆవేదన వ్యక్తం చేశారు. అర్బన్ డెవలప్మెంట్ రెండవ విడత నిధులు 30 కోట్లు ఎందుకు విడుదల కావటం లేదని, అందుకు కారకులు ఎవరనే విషయం తేల్చుకోవాలని నిర్ణయించారు. 30 కోట్లు విడుదల అయితే వాటిని ఎలా ఖర్చు చేయాలో, ఏ వార్డులో ఏ అభివృద్ధికి ఖర్చు చేయాలో కౌన్సిల్ లో చర్చ జరగాలని అన్నారు. పై నుంచి మనపై అభిప్రాయాలు రుద్దితే కుదరదని నిర్ణయించారు. ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావు వైరా మునిసిపాలిటీ సభ్యుల్లో కొందరికి 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయటం ఏమిటని, పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు మున్సిపాలిటీకి ఇస్తే కౌన్సిల్ తీర్మానం ప్రకారం పనులు జరుగుతాయని, కాని వారికి ఇష్టం వచ్చిన వారికి నిధులు మంజూరు చేయటం ఏమిటని కూడా సభ్యులు సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో పొంగులేటి పార్టీ మార్పిడి విషయాలు కూడా హాట్ హాట్ గా సాగినవి. చైర్మన్ సూత కాని జైపాల్ పార్టీ మారితే అతనిపై అవిశ్వాస తీర్మానం సమస్య తలెత్తితే, మునిసిపాలిటీ కి రావలసిన, ఇంకా జరగవలసిన అభివద్ధికి నిధులు ముందుగా ఇస్తేనేనని ఘంటా పదంగా చెబుతున్నారు. ఈ సమావేశం ప్రభుత్వ వ్యతిరేక సమావేశంగా మారింది. మునిసిపాలిటీ విలీన గ్రామాల ప్రజలు తమను ఎందుకు విలీనం చేశారని నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. గతంలో భూములు, ఇళ్లు అమ్ముకోవటానికి ఏ నిబంధనలు అడ్డు రాలేదని, ఇప్పుడు అడుగడుగునా అడ్డంకులే నని, ప్రజలడిగే ప్రశ్నలకు సమాధానం లేదని వాపోయారు. వైరా మునిసిపాలిటీ అభివృద్ది నిరోధకానికి జిల్లా మంత్రి, వైరా ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సి, ఎంపి, సుడా అందరూ బాధ్యులేనని ప్రభుత్వ వ్యతిరేక తీర్మానం చేశారు.