Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒరిగింది శూన్యం
- ఊసేలేని స్టీల్ ఫ్యాక్టరీ...రైల్వే లైన్ల పొడగింపు..
- 'ఉపాధిహామీ'కి కోత...వ్యవసాయానికి వాత
- ద్రవ్యోల్బణం...ధరల బాదుడు షరామామూలే..!
- కేంద్ర బడ్జెట్‌పై బీజేపేతర పక్షాల పెదవి విరుపు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్లో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్-2023-24పై బీజేపేతర పక్షాలు విరుచుకుపడుతున్నాయి. కార్పొరేట్లకు తప్ప దేశంలో మిగతా ఏ వర్గాలకూ మేలు చేసేలా ఈ బడ్జెట్ లేదని ధ్వజమెత్తుతున్నాయి. ఇది రైతు, గ్రామీణ, పేదలు, తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ అని పార్లమెంట్లో బీఆర్ఎస్లోక్సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు ఆరోపించారు. రూ. 45,03,097 కోట్లతో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ బీజేపీ మార్క్ స్వదేశీ ముసుగు కార్పొరేట్ బడ్జెట్‌గా నేతలు అభివర్ణిస్తున్నారు. ఈ బడ్జెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకంటూ ప్రత్యేకంగా ఏ ఒక్క హామీ లేకపోగా...గతంలో ఇచ్చిన ఒకటి, రెండు హామీలకు నిధులు కేటాయింపులు లేవని మండిపడుతున్నారు. వ్యవసాయానికి ఇదీ పూర్తి ప్రతికూల బడ్జెట్‌గా పేర్కొంటున్నారు. ఆదాయపన్నును రూ.5 నుంచి రూ.7 లక్షలకు పెంచడం ఒకింత ఊరట తప్ప మిగతా ఏ విషయంలోనూ బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని సంతృప్తి పరచలేకపోయిందని...రాష్ట్రాలపై కేంద్రం గుత్తాధిపత్యాన్ని నిలుపుకునేలా కేటాయింపులు న్నాయని మండిపడుతున్నారు.
ఇది పక్కా రైతు వ్యతిరేక బడ్జెట్
నామ నాగేశ్వరరావు, బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత
'కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించింది. బడ్జెట్లో ఎక్కడా రైతులపైనా మాట్లడలేదు. రైతు ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారు. కర్నాటకలో మాత్రమే కరువు వుందా..? దేశంలో ఎక్కడా లేదా? రూ.5,300 కోట్లు ఒక్క రాష్ట్రానికే ఇచ్చారు. 9 ఏళ్లలో రెండు కోట్ల ఉద్యోగాల సంగతేమైంది. రైల్వే ప్రాజెక్టుల విషయంలోనూ తీరని అన్యాయం చేశారు. కాజీపేట రైల్వే కోచ్ ఊసేలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హౌదా, విభజన హామీల విషయంలో రాష్ట్రానికి బడ్జెట్లో తీరని అన్యాయం చేశారు. విద్యా, వైద్యానికి నిధుల్లో భారీగా కోత విధించారు. తెలంగాణకు రావాల్సిన వేలాది కోట్ల బకాయిలు, నిధుల ప్రస్తావనే లేదు. అన్నదాతను పూర్తిగా విస్మరించిన కేంద్రం తగిన మూల్యం చెల్లించక తప్పదు.
తెలంగాణకు తీరని అన్యాయం
పువ్వాడ అజరు కుమార్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి
ఇది తెలంగాణ రాష్ట్రానికి మరోసారి తీవ్ర అన్యాయం చేసిన బడ్జెట్. రైతు, ఉపాధిహామీ కూలీల వ్యతిరేక బడ్జెట్. దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసేలా ఉంది. ఉద్యోగులకు ఊరట ఇవ్వలేకపోయింది. కార్పొరేట్లకు మాత్రం అనుకూలంగా ఉంది. రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీసేలా ఉంది. విద్య, వైద్య రంగాలను పట్టించుకోలేదు. 7 ప్రాధాన్యత రంగాలని ప్రకటించి... ఉన్న రంగాలను గాలికి వదిలివేశారు. ఇది దేశ రైతాంగాన్ని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరుత్సాహపరిచేలా ఉంది. తొమ్మిదేళ్లుగా తెలంగాణ అడుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి ఊసే లేదు. గిరిజన యూనివర్సిటీకి ఇచ్చిన నిధులు తూతూమంత్రమే. విభజన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదు. జాతీయ ప్రాజెక్టు హౌదా ఇవ్వలేదు. రాష్ట్రంలోని నేతన్నలకు జీఎస్టీ రాయితీలు కానీ, ప్రత్యేక ప్రోత్సాహాలు ప్రకటించలేదు. తెలంగాణకు ఒక్క పారిశ్రామిక వాడనూ కేటాయించలేదు. రైతుల నిధుల్లో భారీగా కోత పెట్టారు. ఎరువుల సబ్సిడీలు తగ్గించారు. గ్రామీణ ఉపాధి హామి నిధుల్లో కోత పెట్టారు. ఆహార సబ్సిడీలు తగ్గించారు. కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేస్తామని చెప్పలేదు. ఉద్యోగులకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన పన్ను మినహాయింపులు కూడా ఆశాజనకంగా ఏమీ లేవు. ఉద్యోగులను సైతం భ్రమల్లో పెట్టారు. సెస్సుల భారం కూడా తగ్గించకపోవడం దారుణం. పేదల ఆహార భద్రత నిధుల్లో భారీ కోత విధించి, వారి పై భారాన్ని మోపుతున్నది.
రాష్ట్రాలను బలహీనం చేసే బడ్జెట్
వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ ఎంపీ
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ రంగానికీ మంచి చేసింది లేదు. రాష్ట్రాలను బలహీనపరిచేలా ఈ బడ్జెట్ ఉంది. తెలంగాణ డిమాండ్లేవీ పట్టించుకోలేదు. కేంద్రం గతంలో 157 వైద్య కళాశాలలు మంజూరు చేస్తే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తామంటున్న నర్సింగ్ కాలేజీల విషయంలోనూ కేంద్రం అన్యాయం చేసేలా ఉంది. తెలంగాణకు ఐఐఎం, గిరిజన విశ్వవిద్యాలయానికి ఆశించిన నిధులు ఇవ్వకపోవడం, జిల్లాకో నవోదయ పాఠశాల, బయ్యారం స్టీల్, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీల ఏర్పాటుపై ప్రస్తావనే లేదు.
సవాళ్లకు సమాధానం లేదు..
నున్నా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి
దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు సమాధానం ఇవ్వలేని బడ్జెట్ ఇది. రాష్రం, ఖమ్మం జిల్లాకు కొత్త ప్రతిపాదనలేమీ లేకపోగా గతంలో ఇచ్చిన హామీల ప్రస్తావనేదీ లేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారే కానీ ఆచరణ లేకపోవడంతో అప్పులు, ఆత్మహత్యలు పెరిగాయి. గతంలో పోల్చుకుంటే వ్యవసాయ ఉపకరణాల రేట్లు పెరిగాయి. పంటలకు మద్దతు ధర ఊసే లేదు. దేశానికున్న రూ.137 లక్షల కోట్లలో రూ.11 లక్షల కోట్లు వడ్డీకే పోతున్నాయి. విద్యా, వైద్య రంగాలకు కేటాయింపులు తగ్గాయి. ఉత్పాదక, ఉపాధి రంగం కేటాయింపులు లేవు. ఉపాధిహామీకి గతం కంటే రూ.30వేల కోట్లు తగ్గించారు. కార్పొరేట్లకు రూ.12 లక్షల కోట్లు మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం రైతు రుణమాఫీకి రూ.2 లక్షల కోట్లే కేటాయించడానికీ సిద్ధంగా లేదు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, భద్రాచలం- కొవ్వూరు రైల్వేలైన్, విభజన హామీల ఊసేలేదు. వేతన జీవులకు రూ.7 లక్షల వరకు పన్ను మినహాయింపు చిన్న ఊరట. మధ్య, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలకు 2శాతం పన్ను మినహాయింపు 2శాతం కాగా కార్పొరేట్లకు మాత్రం 10 శాతం ఇవ్వడం గమనార్హం.
కార్పొరేట్ అనుకూల బడ్జెట్
బాగం హేమంతరావు, సీపీఐ జాతీయ సమితి సభ్యులు
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్‌కు అనుకూలం. ఆర్థిక అసమానతలు పెంపొం దించేలా ఉంది. సామాన్యులకు లాభం లేకపోగా అధిక ఆదాయవర్గాలకు ఊరట నిస్తోంది. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపే ఉపాధి అవకాశాలపై ప్రస్తావనలేదు. రైతులకిచ్చిన హామీలు, కనీస మద్దతు ధర చట్టం గురించి మాటలేదు. ఆర్థికమంత్రి ప్రసంగానికి, కేటాయింపులకు పొంతనలేదు. గ్రామీణ ఆర్థికవ్యవస్థను దిగజార్చే చర్యలే ఉన్నాయి. ఎన్ఆర్ఈజీఎస్, వ్యవసాయరంగం, విభజన చట్టంలోని హామీలకు కేటాయింపులు లేవు. ఇది పేద, సామాన్య వర్గాలకు ప్రతికూల బడ్జెట్.
బీజేపీ మార్క్ స్వదేశీ ముసుగు బడ్జెట్
పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథ, రాష్ట్ర కార్యదర్శి
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పేద, మధ్యతరగతి వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసేలా ఉంది. దేశంలో కీలకమైన వ్యవసాయానికి తగిన కేటాయింపులు లేవు. వ్యవసాయ చట్టాల రద్దు గురించి ప్రస్తావన లేదు. కార్పొరేట్‌కు దెబ్బతగలకుండా పేద, మధ్యతరగతి వర్గాలు వినియోగించే వస్తువుల ధరలు పెంచారు. రాష్ట్రాలకు తగిన నిధులు కేటాయించకుండా కేంద్రం గుత్తాధిపత్యం చెలాయించేలా ఈ బడ్జెట్ ఉంది. రైల్వే లైన్స్ పొడగింపు, కోచ్ ఫ్యాక్టరీ విషయాలలో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది. బీజేపీ మార్క్ స్వదేశీ ముసుగు కార్పొరేట్ బడ్జెట్ ఇది.
తెలంగాణకు మొండిచేయి..
పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఖమ్మం
బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మొండిచేయి చూపారు. కార్పొరేట్లను తప్ప ఏ ఒక్క వర్గాన్ని సంతృప్తి పరచలేక పోయారు. వ్యవసాయ చట్టాలు రద్దు గురించి ప్రస్తావనే లేదు. ఉమ్మడి జిల్లాకు గతంలో ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయించలేదు. కొత్తగా ఒక్క పైసా కేటాయించలేదు. రైల్వేలైన్ల పొడగింపు అంశమాత్రం ప్రస్తావించలేదు. మొత్తమ్మీద ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ఏమాత్రం సంతృప్తి ఇచ్చేలా లేదు.