Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విప్లవ సిందూరం.. నెత్తుటి మందారం
- వెలుగుల జెండా పేదొళ్ల అండ రావెళ్ల
- నేడు 38వ వర్థంతి
పీడిత ప్రజల పక్షాన ఆలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు రావెళ్ల సత్యం. మార్క్సిస్ట్ మహానేత పుచ్చలపల్లి సుందరయ్య ప్రియ శిష్యుడిగా ఉద్యమంలోకి అడుగు పెట్టి ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగులు నింపాడు. ఎర్రజెండా నీడలో అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందారు. సమితి ప్రెసిడెంట్‌గా, జిల్లా మార్కెటింగ్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టి సీపీఐ(ఎం)ని సముచిత స్థానానికి తీసుకెళ్లి సహకార సంఘానికి మార్కెటింగ్ ఉద్యోగులకు వెన్నుదన్నుగా నిలిచిన ఆదర్శప్రాయుడు. నేడు ఆయన 38వ వర్ధంతి సందర్భంగా నవతెలంగాణ కథనం..
నవతెలంగాణ-ముదిగొండ
ముదిగొండ మండలం గోకినపల్లికి చెందిన రావెళ్ళ వీర తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని నిజాం నవాబు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. 1927 జనవరిలో మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన రావెళ్ళ 1945-46 కాలంలో ఊర్ధూలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. తన ఇంటి ఆవరణలోని పశువుల పాకలో ఓ పాఠశాలను నిర్వహించి ఆఖరికు దాన్నే కమ్యూనిస్టు పార్టీకి వేదికగా మార్చుకున్నారు. 1946-48 మధ్య కృష్ణా జిల్లా మల్కాపురం సరిహద్దు క్యాంపునకు చేరుకొని సమరయోధుడిగా శిక్షణ పొందాడు. పైకమిటీ ఆదేశాల మేరకు అజ్ఞాత వాసానికి వెళ్లారు. జిల్లా సరిహద్దులో అరెస్టయి మద్రాస్ రాష్ట్రం కడలూరు సెంట్రల్ జైలుకు వెళ్లాడు. ఆ సమయంలో కమ్యూనిస్టు నాయకులు మోటూరు హనుమంతరావు, జిల్లాకు చెందిన రాయల వీరయ్య ఆయనకు జైలులో పరిచయమయ్యారు. 1951 సాధారణ ఎన్నికలు వెలువడిన సమయంలో కమ్యూనిస్టు నాయకులతో పాటు రావెళ్లను జైలు నుంచి విడుదల చేశారు. వెంటనే రైతుకూలి ఉద్యమాలు, ఎన్నికల సమరానికి దూకారు. 1951-66 ప్రాంతంలో గ్రామాలు తిరుగుతూ, ప్రజలను కలుస్తున్న సమయంలో అనారోగ్యం బారినపడి హైదరాబాద్‌లో చికిత్స పొందారు. అనంతరం పార్టీకి ఖమ్మం జిల్లా పూర్తి కాలం కార్యకర్తగా పనిచేశారు.
సుందరయ్య వారసుడిగా.. :
1964లో పార్టీలో చీలికలు వచ్చినప్పుడు హైదరాబాద్ సెంట్రల్ జైలులో ఆ పార్టీ నాయకులతో కలిసి 16నెలల పాటు జైలు జీవితం గడిపారు. 1966-68లో గ్రామాల్లో భూ పోరాటాలు, రైతు కూలీ ఉద్యమాలు నిర్వహించారు. రావెళ్ళ నాయకత్వంలో చింత కాని, నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయ పాలెం, ముదిగొండ, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేవారు. ప్రధానంగా ముదిగొండ మండలంలో పమ్మి, ముత్తారం, కమలాపురం, బాణాపురం, పెద్దమండవ, అమ్మపేట, గంధసిరి గ్రామాల్లో బలమైన ఉద్యమాలు నిర్వహించారు.
ఈ క్రమంలో భూస్వాముల్లో వ్యతిరేకత పెరిగింది. భూస్వాములంతా ఒక్కటై కాంగ్రెస్‌కు చెందిన సామినేని ఉపేంద్రయ్యను ఆశ్రయించి నాటి హోం మంత్రి జలగం వెంగళరావు అండతో గ్రామాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. నిర్భందకాండ, పోలీసు క్యాంపులు పెట్టి కమ్యూనిస్టు కార్యకర్తలను, సానుభూతిపరులను తీవ్రంగా హింసించారు. అయిన బెదరక భూస్వాముల ఆగడాలను ఎదుర్కొని ప్రజాఉద్యమాన్ని విజయవంతం చేశారు. ఈ ఉద్యమంలో అనేకమంది అసులువు బాసారు. 1970-82 మధ్య కాలంలో జరిగిన సాధారణ, పంచాయతీ, జిల్లా మార్కెటింగ్ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ విజయఢంకా మోగించింది. సహకార సంఘానికి జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షుడిగా పని చేసి వెన్నుదన్నుగా నిలిచారు. 1982లో ఖమ్మం సమితి ప్రెసిడెంట్‌గా పని చేసిన రావెళ్ల ప్రజలకు, పార్టీకి అనేక సేవలందించారు. 1985లో మధ్యంతర ఎన్నికల్లో రావెళ్లను ఖమ్మం శాసన సభ్యుడిగా పోటీ చేయించాలని పార్టీ నిర్ణయించింది. అదే ఏడాది ఫిబ్రవరి 2న గుండెపోటుతో అకాల మరణం చెందిన ప్రజల గుండెల్లో నిలిచారు.
ప్రస్తుతం సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న తమ్మినేని వీరభద్రంకు రావెళ్ల సత్యం గురువు కావడం విశేషం.