Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీటిపారుదలశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన
- డిఈఈని గదిలో పెట్టి తాళం వేసిన రైతులు
- సీఈ హామీతో ఆందోళన విరమణ
నవతెలంగాణ - బోనకల్
ఎండిపోతున్న మొక్కజొన్న పంటను కాపాడాలని అన్నదాతలు గురువారం బోనకల్ బ్రాంచ్ కెనాల్ బ్రిడ్జి ముందు రాస్తారోకోకు దిగారు. పోలీసులు జోక్యంతో ఆ తర్వాత నీటిపారుదల శాఖ కార్యాలయానికి చేరుకొని డిఈఈని గదిలో బంధించి గదికి తాళం వేసి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. బోనకల్ మండలంలో యాసంగిలో 14,500 ఎకరాలలో అన్నదాతలు మొక్కజొన్న పంటను సాగు చేశారు. నాగార్జునసాగర్ ఆధారంగానే అనేక గ్రామాలలో మొక్కజొన్న పంటను అన్నదాతలు సాగు చేశారు. సాగర్ నీటిని పంటలకు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అన్నదాతల పెద్ద ఎత్తున సాగర్ కాలువల కింద మొక్కజొన్న పంట సాగు చేశారు. ప్రధానంగా నారాయణపురం, ఆళ్లపాడు మైనర్ల కింద ఆళ్లపాడు, గోవిందాపురం ఏ, రావినూతల, నారాయణపురం, చిరునోముల, చిన్న బీరవల్లి తదితర గ్రామాలలో పెద్ద ఎత్తున మొక్కజొన్న పంటను అన్నదాతలు సాగు చేశారు. నీటిపారుదల శాఖ అధికారులు మాటలను నమ్మి అన్నదాతలు మొక్కజొన్న పంటను సాగు చేయగా వారబందీ పేరుతో రైతులను ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నదాతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వారబంది అని చెబుతూనే వారబందిని కూడా అమలు చేయకుండా రోజుల తరబడి సాగర్ నీటిని నిలిపివేయటం వలన పొట్ట దశకు వచ్చిన మొక్కజొన్న పంట ఎండిపోతుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. అయినా నీటిపారుదల శాఖ అధికారులలో సరైన స్పందన కనిపించకపోవడంతో పలు గ్రామాలకు చెందిన అన్నదాతలు వైరా- జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై బోనకల్ బ్రాంచ్ కెనాల్ బిబిసి బ్రిడ్జి ముందు అన్నదాతలు పెద్ద ఎత్తున హాజరై రాస్తారోకోకు దిగారు. దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలిసిన బోనకల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏఎస్ఐ కోడిగంటి నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అద్దంకి ఆనందకుమార్‌లు ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లారు. ఆందోళన వలన వాహనాలు భారీగా నిలిచిపోయాయని దీనివల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని, వెంటనే ఆందోళన విరమించాలని రైతులకు సూచించారు. దీంతో అన్నదాతలు బోనకల్లులోని నీటిపారుదల శాఖ డిఈఈ కార్యాలయానికి చేరుకున్నారు. రైతులు నీటిపారుదల శాఖ కార్యాలయానికి వచ్చే సమయానికి డిఈఈ పబ్బతి శ్రీనివాస్ కార్యాలయంలోనే ఉన్నారు. దీంతో అన్నదాతలు తీవ్ర ఆగ్రహంతో డిఈఈని గదిలో ఉంచి తాళం వేసి కార్యాలయం ముందే ధర్నాకు దిగారు. ఒకవైపు పంటలు ఎండిపోతుండగా నీటిపారుదల శాఖ ఈఈ రామకృష్ణ వారబందీ పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు విమర్శించారు. రైతుల ఆందోళన చేస్తున్న విషయాన్ని డీఈఈ ఫోన్ ద్వారా రామకృష్ణకు సమాచారం అందించారు. తాను సాగర్ కాలవలపై ఉన్నానని, నీటిని విడుదల చేస్తూ పర్యవేక్షిస్తున్నానని వారబందీ ప్రకారం నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. బోనకల్ నీటిపారుదల శాఖ కార్యాలయం వద్దకు రావాలని అన్నదాతలు పట్టుబట్టారు. అందుకు రామకృష్ణ తాను కాలవలపై ఉన్నానని అక్కడకు రాలేనని స్పష్టం చేశాడు. దీంతో కొద్దిసేపు అన్నదాతలు ఆందోళన చేసి విరమించారు. ఆ తర్వాత డిఈఈ గదికి రైతులు తాళం తీసి వెళ్లారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గూగులోతు రమేష్, రైతుబంధు మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్‌రావు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, రావినూతల సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు, రైతులు పారా ప్రసాద్, బుక్య బద్రునాయక్, షేక్ సైదా తదితరులు పాల్గొన్నారు.
సీఈ శంకర్ నాయక్ హామీతో ఆందోళన విరమణ
డిఈఈ శ్రీనివాస్ సమస్యను ఫోన్లో ఈఈ రామకృష్ణకు వివరించారు. ఈఈ బోనకల్ నీటిపారుదల శాఖ కార్యాలయానికి రావాలని రైతులు పట్టుపట్టారు. దీంతో ఈఈ బోనకల్ నీటిపారుదల శాఖ కార్యాలయానికి వచ్చారు. రైతులతో దాదాపు ముప్పావు గంట పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రైతులు సాగునీటి సమస్యతో పంటల ఎండిపోతున్న పరిస్థితిని ఆయనకు వివరించారు. దీంతో రామకృష్ణ సమస్యను సిఈ శంకర నాయక్‌కు వివరించారు. డ్యాము నుంచే తక్కువ నీరు వస్తున్నాయని, అందువలన బోనకల్ బ్రాంచ్ కెనాల్‌కి తక్కువ నీటిని విడుదల చేస్తున్నామని రైతులకు తెలిపారు. దీనికి తోడు పైభాగాన నీటి వినియోగం ఎక్కువగా ఉన్నందువలన సమస్య ఏర్పడుతుందని రైతులకు వివరించారు. చివరకు సిఈ రెండు మూడు రోజులలో పూర్తిస్థాయిలో సాగర్ నీటిని బీబీసీకి విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు కూడా రామకృష్ణ ఫోన్లో సమస్యను వివరించారు. ఆయన కూడా నీటి విడుదలకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతులు తమ ఆందోళన విరమించారు.