Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
మండలంలోని 25 గ్రామాలకు వారం రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఉప కార్య నిర్వహణ అధికారి మిషన్ భగీరథ గ్రిడ్ వైరా గురువారం ప్రకటించారు. మిషన్ భగీరథ నిర్వహణలో నిర్వహించబడుతున్న బోడేపూడి సుజల స్రవంతి రక్షిత మంచినీటి పథకం ఇంటేక్ వెల్ లోకి వైరా ప్రాజెక్ట్ నుండి నీరు రాని కారణంగా నీటి సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నందున వారం రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కనుక గ్రామ పంచాయతీలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే వారం రోజులుగా గ్రామాలకు మంచినీటి సరఫరా లేదు. 2002లో ప్రారంభమైన బోడేపూడి సుజల స్రవంతి పథకం ద్వారా వైరా, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండల గ్రామాలకు వైరా ప్రాజెక్ట్ నుండి రక్షిత మంచినీరు విడుదల చేశారు. మిషన్ భగీరథ పథకం వచ్చిన తరువాత గతంలో ఉన్న సుజల స్రవంతి పథకం ద్వారా కేవలం వైరా మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు మరో మూడు శివారు గ్రామాలకు మంచి నీరు సరఫరా చేస్తున్నారు. ఈ స్కీమ్‌కు ప్రాజెక్ట్ లోతట్టులోని దూర ప్రాంతం నుండి నీరు వచ్చేందుకు పైపు లైన్లు వేశారు. ఇప్పటికీ 20 ఏళ్లు దాటి నందున పైపు లైన్లు సిల్ట్ ( మట్టి)తో నిండి పోయి ఫిల్టర్ బెడ్స్ వరకు సరఫరా కావలసిన నీరు రానందున పైపులకు పై బాగంలో రంధ్రాలు పెట్టి కొద్దీ వారాలు స్కీమ్ నడిపారు. కానీ ప్రాజెక్ట్ ఆయకట్టు కింద రబీ వరి సాగు చేస్తున్నందున ప్రాజెక్ట్ నీటి మట్టం తగ్గి పోయి మంచినీటి స్కీమ్ పైపులు బయట పడినవి. వారం రోజులుగా నీరు రాక స్కీమ్ మూత పడింది. భగీరథ నీళ్ళు రావటం లేదని కొంత మంది సర్పంచ్‌లు వారం రోజులుగా అధికారులకు ఫోన్ చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో గతంలో ఉన్న మంచినీటి పథకాలు మూత పడినవి. వాటి నిర్వహణ పంచాయతీలకు భారంగా మారింది. కనీస మరమ్మతులకు కూడా నిధులు లేక సతమతం అవుతున్నారు. మిషన్ భగీరథ వచ్చిన తరువాత నీటి కుళాయి బిల్లులు వసూలు చేయాల్సిన అవసరం లేదని గ్రామ పంచాయతీలకు జిఓ పంపారు. అంతే గాక 6 నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రాక అవస్థలు పడుతున్న తరుణంలో గ్రామ పంచాయతీలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటం ఎలా సాధ్యమని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.