Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవస్థల పడుతున్న అన్నదాతలు
- రాత్రి సమయంలో విద్యుత్ మోటార్ల వద్ద రైతన్న పడి కాపులు
నవతెలంగాణ - బోనకల్
అప్రకటిత విద్యుత్ కోత వలన అన్నదాతలు పడరాని అవస్థలు పడుతున్నారు. వ్యవసాయానికి ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక రాత్రి సమయంలో సైతం అన్నదాతలు విద్యుత్ మోటార్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మండల వ్యాప్తంగా యాసంగిలో మొక్కజొన్న 14,500 ఎకరాలలో వరి 350 ఎకరాలలో వేరుశనగ 46 ఎకరాలలో మినుము 30 ఎకరాలలో శనగ 10 ఎకరాలలో పెసర 25 ఎకరాలలో అన్నదాతలు వివిధ రకాల పంటలను సాగు చేశారు. మండల వ్యాప్తంగా మొత్తం 14,961 ఎకరాలలో అన్నదాతలు పంటలను సాగు చేశారు. సాగర్ కాలవల ఆధారంగా, 24 గంటల విద్యుత్ సరఫరా ఆధారంగా యాసంగిలో అన్నదాతలు ఈ పంటలను సాగు చేశారు. కానీ బోనకల్ బ్రాంచ్ కెనాల్‌కు వారబంది అమలు చేస్తున్నారు. ఈ వారబందీ కూడా నీటిపారుదల శాఖ అధికారులు ప్రకటించిన విధంగా కాకుండా ఇష్టానుసారంగా వారబంధిని అమలు చేస్తున్నారని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్నదాతలు సాగర్ నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మండల వ్యాప్తంగా 2,600 విద్యుత్ వ్యవసాయ మోటార్లు ఉన్నాయి. ఈ విద్యుత్ వ్యవసాయ మోటార్ల కింద ప్రధానంగా గోవిందాపురం ఎల్, లక్ష్మీపురం, తూటికుంట్ల, పెద్ద బీరవల్లి, రాపల్లి, బ్రాహ్మణపల్లి, కలకోట, మోటమర్రి, చిన్న బీరవల్లి, గోవిందాపురం ఏ, ఆళ్ళపాడు, పెద్ద బీరవల్లి తదితర గ్రామాలలో అధిక శాతం వ్యవసాయ విద్యుత్ మోటార్ల కిందనే అన్నదాతలు పంటలు సాగు చేస్తున్నారు. కానీ బోనకల్ మండలంలో వ్యవసాయ విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎందుకు పోతుందో ఎందుకు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొని ఉందని అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బోనకల్ బ్రాంచ్ కెనాల్‌కు వారబందీని సక్రమంగా అమల చేయకపోవడం, మరొకవైపు అప్రకటిత విద్యుత్తు కోత వలన అన్నదాతలు పంటలను కాపాడుకునేందుకు పడరా అని పాట్లు పడుతూ నరకయాతన అనుభవిస్తున్నారు. ఎకరానికి మొక్కజొన్నకు ఇప్పటికే అన్నదాతలు 25 వేల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారు. కానీ సాగునీటి సమస్యతో పంటలు చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పగలు, రాత్రి సమయాలలో ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియక అన్నదాతలు తీవ్ర ఆందోళన ఆవేదన చెందుతున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక అన్నదాతల రాత్రి సమయంలో విద్యుత్తు మోటార్ల వద్దే పడి కాపులు కాస్తున్నారు. విద్యుత్తు రాగానే మోటార్లు వేసుకుంటూ రాత్రి సమయంలోనే పంటల కోసం కష్టాలు పడుతున్నారు. కనీసం ఇచ్చే విద్యుత్ ను ఏ సమయంలో ఇస్తారో కూడా విద్యుత్ శాఖ అధికారులు కూడా స్పష్టంగా చెప్పడం లేదని దీనివల్ల కూడా తాము ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు తీవ్ర ఆగ్రహం, అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సమయాలలో విద్యుత్తు కోసం విద్యుత్ అధికారులకు ఫోన్ చేస్తే కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తమకే తెలియటం లేదని సమాధానం చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రభుత్వం అన్నదాతల జపం చేస్తూనే మరోవైపు ఆ అన్నదాతలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నదాతలు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యుత్ శాఖ అధికారులు వ్యవసాయానికి ఏ సమయంలో విద్యుత్తు సరఫరా చేస్తారో స్పష్టంగా చెప్పాలని అన్నదాతలు కోరుతున్నారు.
రాత్రి సమయంలో మోటారు వద్దే ఉంటున్న : కారంగుల కోటేశ్వరరావు, రైతు, గోవిందాపురం ఎల్
కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక రాత్రి సమయంలో తాను మోటారు వద్దే పడి కాపులు కాస్తున్నాను. ఒక్కొక్కసారి రాత్రి సమయంలో కూడా విద్యుత్తు రావటం లేదు. దీంతో ఎప్పుడు వస్తుందో తెలియక విద్యుత్ మోటార్ వద్ద నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్న. రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఎవరికి చెప్పిన ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదు. ఇప్పటికైనా అధికారులు విద్యుత్ ఏ సమయంలో ఇస్తారో స్పష్టంగా రైతులకు తెలపాలని కోరారు. ఇదే పరిస్థితి కొంతకాలం కొనసాగితే సాగు చేసిన పంటలు మొత్తం ఎండిపోక తప్పదు.