Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ సౌకర్యం అందించాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-మణుగూరు
ఏసీడీల పేరుతో ప్రజలపై అదనపు భారం మోపద్దని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. శుక్రవారం శ్రామిక భవనంలో విలేకరులతో మాట్లాడుతూ పేదలు, సామాన్యులపై రాష్ట్ర ప్రభుత్వం దొంగ చాటుగా విద్యుత్ భారాలను మోపడం సరైనది కాదని విమర్శించారు. నెలవారి బిల్లులలో ఏసీడీ చార్జీల పేరుతో బిల్లుల్లో వసూలు చేయడం దారుణమన్నారు. బిల్లులు కట్టని వారి మొండిబకాయల వారి ఆస్తులు జప్తు చేసుకోవాలి కానీ, రెగ్యులర్గా బిల్లులు కడుతున్న వారిపై ఇలా అమలు జరపడం దారుణం అన్నారు. అధికారులు ప్రజలపై ఆధారపడి చార్జీలు పెంచుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం దాని అధికారులు నిబంధన విరుద్ధంగా పాటించడం దారుణమన్నారు. సిబ్బంది కొరత వలన 30 రోజుల రీడింగ్ తీయాల్సిన బిల్ కలెక్టర్ బిల్లును, 40 రోజులకు రీడింగ్ తీయడంతో ప్రజలపై రీడింగ్ పెరిగాయన్నారు. స్లాబ్ రేటు మారిపోయి అదనపు భారాలు పెరుగుతున్నాయన్నారు. ఇది ఒక రకమైన దోపిడీ జరుగుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ బిల్లులు, శాసనసభ్యులకు విలాసవంతమైన కార్యాలయాలు నిర్మించారని ఈ భవనాలు నిర్మించినప్పటి నుండి ఇప్పటివరకు బిల్లులు చెల్లించిన దాఖలాలు లేవని ఆరోపించారు. 2017 డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్తు ఇస్తామన్న ప్రభుత్వం గత కొంతకాలంగా విఫలమవుతుందన్నారు. బోరుబావులకు 24 గంటలు త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వేసంగి రైతులు కరెంటు సౌకర్యం లేక ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏజే.రమేష్, జిల్లా కమిటీ సభ్యులు గద్దల శ్రీనివాసరావు, మండల కార్యదర్శి కొడిశాల రాములు, సీనియర్ నాయకులు నెల్లూరీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.