Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భక్త రామదాసు ద్వారా నీటిని విడుదల చేయాలి: రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణ -కూసుమంచి
మండలంలోని పోచారం గ్రామపంచాయతీ పరిధిలో చింతలచెరువుకు భక్త రామదాసు ఎత్తిపోతల నీరు రాకపోవటంతో రెండు పంటలు పండే అవకాశం లేక సుమారు 80 మంది ఎస్సీ, బీసీ, చిన్న సన్నకారు రైతులు రెండో పంట వేయలేదు. దీంతో పోచారం గ్రామ రైతులు దిక్కుతోచని పరిస్థితిలో వున్నారు. శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో చెరువు, కుంటలను పరిశీలించారు.ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ.. పోచారం గ్రామంలో ఒక చెరువు, రెండు , కుంటలు వున్నాయని, ఈ చెరువులకు భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని సరఫరా చేసినట్లయితే, పోచారం గ్రామంలో చాలామంది రైతుల బీడు భూములు వ్యవసాయ సేద్యంగా మారుతాయని, ఈ సమస్యని వెంటనే స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పరిష్కరించి రైతులను, వ్యవసాయాన్ని కాపాడాలని రైతు సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు తోటకూరి రాజు, బిక్కసాని గంగాధర్ ,జిల్లా నాయకులు మల్లెల సన్మతరావు, ఎడవల్లి రమణారెడ్డి, శీలం గురుమూర్తి, గ్రామ రైతులు అబ్బులు, వెంకటయ్య, కమలహాసన్, మధు, వీరస్వామి, నాగయ్య, కోటయ్య, రామారావు, లింగమ్మ, జయమ్మ, కనకయ్య పాల్గొన్నారు.