Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల తీరుపై ఆగ్రహం
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లిలో రోడ్డు ఆక్రమణ తొలగింపు శుక్రవారం ఉద్రిక్తలకు దారితీసింది. ఆర్అండ్బీ రోడ్ పైన వ్యాపారాలను సాగిస్తున్నారని వాటిని తొలగించే పనిని కార్యదర్శి యాకలక్ష్మి ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది చేపట్టారు. బస్టాండ్ సెంటర్లో కూరగాయల వ్యాపారం సాగిస్తున్న వారి ట్రేలు, కూరగాయలను ఎత్తి ట్రాక్టర్లో వేస్తుండటంతో ఆగ్రహించిన వ్యాపారులు అధికారులతో వాగ్వివాదంకు దిగారు. ఆక్రమణ తొలగింపు అంటూ అధికారులు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ కాని, ఆర్అండ్బీ కాని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఒక వైపు నుండి తొలగింపులు చేపట్టాల్సి ఉండగా బస్టాండ్ సెంటర్కు వచ్చి షాపులను కూల్చి వేయటం ఏమిటని చిన్నవ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్ రోడ్లోని వ్యాపారులు పంచాయతీ ట్రాక్టర్కు అడ్డుగా పడుకొని నిరసన తెలిపారు. గతంలో ఆక్రమణాలను కూల్చి వేసిన అధికారులు సైడ్ కాలువల నిర్మాణం కాని రోడ్డు మరమ్మత్తులకాని చేయలేదని వ్యాపారస్తులు, ఇంటి యాజమానులే స్వంతంగా చేసుకున్నామన్నారు. పరిస్ధితి ఉద్రిక్తతంగా మారటంతో విషయం తెలుసుకున్న ఎంపీడీవో చంద్రశేఖర్, ఎస్సై పుష్పాల రామారావులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వ్యాపారస్తులతో మాట్లాడారు. రోడ్డు పక్కన ఉన్న సైడ్ డ్రైనేజీ కాలువ దాటి వ్యాపారాలు నిర్వహించవద్దని, కాలువ దాటి వేసిన పరదాలు తొలగించాలని ఆదేశించారు. తొలగించకుంటే చట్టప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.