Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి జిల్లాలో నత్తనడకన నిర్మాణాలు
- వసతుల కల్పన కూడా నామమాత్రం
- ఖమ్మంలో 426కు పూర్తయినవి 62
- భద్రాద్రిలో 328కి 50 స్కూల్స్ పూర్తి
- నిధుల లేమితో ఎస్‌ఎంసీల వెనుకడుగు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో పాఠశాల విద్యలో మరింత ప్రగతి సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం 'మన ఊరు- మన బడి/ మన బస్తి- మనబడి' కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా అధిక విద్యార్థులున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను మొదటి దశ కింద ఎంపిక చేసింది. 2021-22 సంవత్సరానికి ఎంపికైన స్కూల్స్‌లో సౌకర్యాలు మెరుగు పరిచేందుకు ప్రణాళిక రూపొందించింది. మొత్తం 12 ప్రాధాన్యత అంశాలను గుర్తించింది. ఖమ్మం జిల్లాలోని 426 పాఠశాలలను మొదటి విడత ఎంపిక చేసింది. వీటికి రూ.135 కోట్లు కేటాయించింది. దీనిలో విద్యాశాఖ ద్వారా రూ.60 కోట్లు, ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.33 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.42 కోట్ల ఖర్చుతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పూనుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 368 పాఠశాలలను మొదటి విడత ఎంపిక చేశారు. వీటికి రూ.60 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 50 పాఠశాలల్లో వందశాతం పనులు పూర్తయ్యాయి. ఖమ్మం జిల్లాలో 66 స్కూల్స్ అంటే కేవలం 14% పాఠశాలల్లోనే వందశాతం పనులు పూర్తవడం గమనార్హం. వాస్తవానికి గత జూన్‌లో స్కూల్స్ ప్రారంభించే నాటికే పనులు పూర్తికావాల్సి ఉన్నా...నేటికీ వందశాతం పూర్తవలేదు. ఇప్పటికే రెండో దశ పనులు ప్రారంభించాలి కానీ తొలి దశ పనులే పెండింగ్‌లో ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.
అ 12 ప్రాధాన్యత అంశాలు...
'మన ఊరు- మనబడి/ మన బస్తి- మనబడి' కార్యక్రమంలో 12 ప్రాధాన్యత అంశాలను తీసుకున్నారు. నిరంతరం నీటి సరఫరాతో మరుగుదొడ్లు, విద్యుదీకరణ, తాగునీరు, ఫర్నిచర్, పెయింటింగ్, పెద్ద తరహా చిన్నతరహా మరమ్మతులు, ఆకుపచ్చ రాతబోర్డులు, ప్రహరీగోడ, వంటగది, ఉన్నత తరగతులకు భోజనశాల, శిథిల భవనాల స్థానంలో నూతన గదులు, డిజిటల్ సౌకర్యాల వంటివి ప్రాధాన్యత అంశాలుగా గుర్తించారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 1215 పాఠశాలలకు గాను 426 స్కూల్స్‌ను తొలి దశలో పనులు చేపట్టాలని నిర్ణయించారు. వీటిలో 423 స్కూల్స్‌లో పనులు ప్రారంభమైనవి, 359 పాఠశాలల్లో పనులు కొనసాగుతుండగా కేవలం 62 మాత్రమే పూర్తయినవి. మొదటి దశ పనుల కోసం రూ.61.84 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు కేవలం రూ.13.73 కోట్లు మాత్రమే విడుదలవడం గమనార్హం.
అ భద్రాద్రి కొత్తగూడెంలో...
భద్రాద్రి కొత్తగూడెంలోనూ మన ఊరు- మనబడి కార్యక్రమం నత్తనడకనే కొనసాగుతోంది. ఇక్కడ తొలి దశలో 368 పాఠశాలలను ఎంపిక చేయగా దీని కోసం రూ.60 కోట్లు కేటాయించారు. వీటిలో పనులు పూర్తయిన 25 పాఠశాలలను ఫిబ్రవరి 1న ప్రారంభించారు. వందశాతం పనులు పూర్తయిన మరో 25 స్కూల్స్‌ను ఈనెల 5న ప్రారంభించచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 80శాతం పనులు పూర్తయినవి వంద, 60 శాతం పూర్తయినవి 200 వరకు ఉన్నాయి. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాల లన్నింటిలోనూ ఎన్ఆర్ఈజీఎస్ కింద టాయిలెట్స్ నిర్మాణం చేపట్టారు. కానీ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
అ నిధుల లేమితో ఎస్‌ఎంసీల వెనుకడుగు...
మన ఊరు- మన బడి పనులు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మాత్రమే చేయాలనే నిబంధన ఉంది. ఇది సమంజసమే అయినప్పటికీ చాలా స్కూల్స్‌లో చైర్మన్లు, సభ్యులు నిరుపేదలకు కావడంతో పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఎదురుపెట్టుబడి పెట్టే స్తోమత వారి వద్ద లేదు. ఎస్ఎంసీలకు అడ్వాన్స్‌గా డబ్బులు ఇచ్చి వారిచేత పనులు చేయిస్తే సకాలంలో పూర్తయ్యేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన ఊరు- మనబడి పనులకు సంబంధించి పంచాయతీలు సైతం తీర్మానం చేశాయి. పనుల నిర్వహణ బాధ్యతలను అప్పగించాయి. కానీ గతంలో పంచాయతీల్లో చేసిన బిల్లులే రాకపోవడంతో నూతనంగా అప్పగించిన పనులు నిర్వహించేందుకు కాంట్రాక్లర్లు సైతం ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఎన్ఆర్ఈజీఎస్ కింద ఈ పనులు నిర్వహిం చాల్సి రావడంతో ఏటేటా ఈ పథకానికి నిధులు తగ్గడం, సకాలంలో రాకపోవడంతో పనులు చేపట్టడం లేదు.
అ పైలెట్ ప్రాజెక్టుల పేరుతో హడావుడి...
పనులు నత్తనడకన సాగుతున్నాయనే అపవాదు నుంచి బయటపడేందుకు ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టులను చేపట్టింది. మండలానికి 15 పాఠశాలలను ఎంపిక చేసినా అన్నింటిలో పనులు పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో పైలెట్ ప్రాజెక్టు కింద రెండు, మూడు స్కూల్స్‌ను ఎంపిక చేసి పనులు నిర్వహిస్తున్నారంటేనే పథకం ఎంత నత్తనడకన సాగుతుందో అర్థం చేసుకోవచ్చని విద్యార్థుల తల్లిదండ్రులంటున్నారు.