Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ భాగం శ్రీనివాసరావు
నవతెలంగాణ-బోనకల్
కాంగ్రెస్ ముసుగులో కొంతమంది ఉంటూ బీఆర్ఎస్కు కోవర్టులుగా పనిచేస్తున్నారని అటువంటి వారు కాంగ్రెస్లో నుంచి వెంటనే వెళ్లిపోవాలని లేదా కాంగ్రెస్ పార్టీ తగిన గుణపాఠం చెబుతుందని గోవిందాపురం ఏ గ్రామ సర్పంచ్ భాగం శ్రీనివాస్ రావు హెచ్చరించారు. మండల పరిధిలోని గోవిందాపురం ఏ గ్రామంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గోవిందాపురం ఏ గ్రామ ప్రజల ఆశీస్సులతో తాను సర్పంచ్ గా ఎన్నికయ్యానని తెలిపారు. గ్రామ ప్రజల ఆకాంక్షల మేరకు గ్రామ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న తన మీద గ్రామ పంచాయతీ సిబ్బంది మీద కావాలని కొంతమంది రాజకీయ నిరుద్యోగులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అటువంటి వారికి తగిన సమయంలో తగిన బుద్ధి చెబుతానని హెచ్చరించారు. తన ఎదుగుదలకు, గ్రామ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ పని పాట లేకుండా ఏదో ఒక సాకుతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా వారికి దమ్ము ధైర్యం ఉంటే తనతో కలిసి గ్రామ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. అవాకులు చవాకులు పేలుతూ, తాటాకు చప్పుళ్ళు చేస్తూ, గ్రామ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. వారు ఒక్కరు కూడా గ్రామంలో కనీసం వార్డ్ మెంబర్ గా గెలిచే సత్తా కూడా లేదన్నారు. ప్రజల అండదండలు, దీవెనలు ఉన్నంతకాలం గ్రామాభివృద్ధికి పాటు పడతానన్నారు. పగలు ఒక పార్టీ రాత్రి మరొక పార్టీ ముసుగులో ఎవరు ఉన్నారో ప్రజలందరికీ తెలుసునని ఆయన ఎద్దేవా చేశారు. గ్రామ ప్రజల చిరకాల సమస్య చెరువు ఆయకట్టు క్రింద సుమారు 200 ఎకరాలకు దారి లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే తాను ఇచ్చిన వాగ్దానం మేరకు తన సొంత స్థలం నుండి ఎనిమిది సెంట్లు రహదారికి ఉచితంగా ఇచ్చానని తెలిపారు. గ్రామాభివృద్ధిపై ప్రజా సమస్యల పరిష్కారం పై గౌరవం ఉంటే తనకు అభివృద్ధిలో సహకరించాలే కానీ ఆటంకం కలిగించ వద్దని సర్పంచ్ కోరారు.