Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
సుదీర్ఘకాలంగా సీఐటీయూ చేస్తున్న పోరాటాల వల్ల సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రూ.2000 వేతనం పెంచుతూ నిర్ణయించారని, పెంచిన వేతనం జీవో విడుదల చేయాలని గత సంవత్సర కాలంగా సీఐటీయూ అనేక రూపాలలో ఆందోళన పోరాటాలు నిర్వహించిందని, వీటన్నిటి ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసిందని సీఐటీయూ శ్రామిక మహిళా కన్వీనర్ మర్లపాటి రేణుక, భద్రాచలం పట్టణ నాయకులు తెలంగాణ మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల యూనియన్ జిల్లా కమిటీ సభ్యురాలు శివమ్మ తెలిపారు. ఫిబ్రవరి 15వ తేదీన మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ కార్యక్రమానికి సీఐటీయూ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి చురుకు తగిలి జీవోను విడుదల చేశారని సీఐటీయూ పేర్కొన్నది. రూ.2000 పెంపు అనేది న్యాయబద్ధంగా లేదని ప్రభుత్వం నియమించిన పీఆర్సీ సిఫార్సుల మేరకు కనీస వేతనాలు అమలు చేయాలని, ఆ లెక్కన మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు రూ.26 వేలు కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ప్రభుత్వం సమస్యల పరిష్కారం చేయాలని అందుకోసమే ఫిబ్రవరి 15వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని సీఐటీయూ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, కోముల, రమాదేవి, సఫియా, రాజేశ్వరి, లక్ష్మి, దమయంతి తదితరులు పాల్గొన్నారు.