Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హార్వెస్ట్ పాఠశాలలో జరిగిన 21వ వార్షికోత్సవ వేడుకలలో వక్తలు
నవతెలంగాణ-ఖమ్మం
నగరంలో హార్వెస్ట్ పాఠశాలలో 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఇ సోమశేఖర శర్మ, ఖమ్మం పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్ వారియర్, క్వెస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ వై.నాగమణి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి ఇ .సోమశేఖర శర్మ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితుల కనుగుణంగా.. విద్యావిధానంలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ బోధించాలన్నారు. విద్యార్థులకు బోధించే పద్ధతులలో వర్క్ లెర్న్ పద్ధతిలో పాఠం నేర్పిస్తే జీవితకాలం గుర్తుంటుందని సూచించారు. ప్రధానంగా సైన్స్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఈ పద్ధతిని అవలంబించి విద్యార్థులకు చదువునేర్పిస్తే శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆసక్తి చూపుతారని తెలిపారు. చిన్నారులలో దాగిఉన్న సజనాత్మక నైపుణ్యాలను వెలికితీసేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. హార్వెస్ట్ ఇటువంటి కృషి జరపడం అభినందనీయమన్నారు. ఖమ్మం పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, సామాజిక అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు, తల్లిదండ్రులపై ఉందన్నారు. చిన్నారులను పూర్తి వ్యక్తిత్వం గలవారిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించటానికి ఆయాపాఠశాలల యాజమాన్యాలు కృషి చేయాలన్నారు. చదువు అంటే పుస్తకాలు, అక్షరాలు మాత్రమే కాదని క్రీడలు, సాంస్కతిక కార్యక్రమాలు, ఎన్.సి.సి. స్కౌట్స్, ఇతర విజ్ఞానదాయక కార్యక్రమాలలో విద్యార్థులకు భాగస్వామ్యం కల్పిస్తే మరింత ఉన్నతంగా రాణిస్తారన్నారు. తల్లిదండ్రులు మార్కులుచూసి ఇతర విద్యార్థులతో పోల్చకుండా ఉండటం, పిల్లలపై భారం పెంచడం వంటివి చేయరాదని అన్నారు. మార్కులనేవి ప్రతిభ కొలమానం కావన్నారు. చిన్నతనంనుండే పిల్లలు వేటిపట్ల ఆసక్తి చూపుతారో వాటిని ప్రోత్సహిస్తూనే సన్మార్గంలో నడచుకునే విధంగా తల్లిదండ్రులు తగుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హార్వెస్ట్ ఈ అన్ని కార్యక్రమాలను ప్రోత్సహిస్తుండటం సంతోషదాయకమన్నారు. హార్వెస్ట్'' విద్యాసంస్థల కరస్పాండెంట్ రవిమారుత్ మాట్లాడుతూ పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులకు సమయం వచ్చిందని అన్నారు. రేపటి తరానికి కావలసిన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని, విద్యార్థినీ, విద్యార్థులు సమాయత్తం కావాలని, ఉన్న అవకాశాలను అన్నింటినీ వినియోగించుకొని, శ్రమకి, పరిశోధనకి, సజనాత్మకతకు ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు. సూత్రాలను వల్లెవేయడంకాక, అన్వయించటాన్ని నేర్పాలని ఉపాధ్యాయులను కోరారు. ఇంటిపనిలో చిన్న చిన్న అవసరాలలో తోడ్పడటానికి కావల్సిన శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులు గ్రహించాలని కోరారు. క్వెస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ వై. నాగమణి మాట్లాడుతూ విద్యకు, నైపుణ్యాలకు, ఉపాధికి, దేశాభివద్ధికి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రభుత్వాలు గ్రహించాలని, వత్తి నైపుణ్యాలు లేని నిరుద్యోగ సైన్యాన్ని ఎంత తయారుచేసినా ప్రయోజనం శూన్యం అని చెప్పారు. విద్యార్ధులు క్రమశిక్షణ, నైపుణ్యం, శ్రమైక జీవన సౌందర్యం. నేర్చుకోవాలని ఉద్భోదించారు. ప్రిన్సిపాల్ పార్వతీ రెడ్డి మాట్లాడుతూ తమ విద్యాసంస్థల్లో చదువుతోపాటు శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించి విద్యార్థులకు విలువైన అవగాహన కల్పించడంలో ఎప్పుడూ ముందుంటున్నాయని, సైన్స్ ఫెయిర్స్లో సంబంధించి తమ విద్యార్ధులకు ఎంతో అవగాహనను పెంపొందించడం వల్ల తమ విద్యార్ధులు అనేక చోట్ల జరిగిన సైన్స్ ఫెయిర్స్లో పలు పతకాలను పొందారని, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీలలో గెలుపొందిన వివరాలను వార్షిక నివేదికలో తెలిపమనారు. తమ ఉపాధ్యాయులకు ప్రతిసంవత్సరం నూతన బోధనా పద్ధతులపై శిక్షణ ఇస్తున్నామన్నారు. బోధనలో పరిపూర్ణతకి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నారన్నారు.